Priya Nair | హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (Hindustan Unilever Ltd)కు తొలిసారి మహిళ నాయకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం కంపెనీ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రియా నాయర్ (Priya Nair).. చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి, మేనేజింగ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన విషయం తెలిసిందే. ఈ నియామకం ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నది.
ప్రస్తుతం సీఈఓగా ఉన్న రోహిత్ జావా (Rohit Jawa) వ్యక్తిగత కారణాల రీత్యా జులై 31తో తన బాధ్యతల నుంచి తప్పుకొంటున్నారు. ఆపై ప్రియా నాయర్ సంస్థను ముందుండి నడిపించనున్నారు. ఆమె ఈ పదవిలో ఐదేళ్ల పాటు కొనసాగుతారు. ఒక మహిళను ఎండీ, సీఈఓ పదవిలో నియమించడం హెచ్‌యూఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో ప్రియా నాయర్ ఎవరన్న ఉత్సుకత మొదలైంది. ఇంతకీ ప్రియా నాయర్ ఎవరు.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎవరీ ప్రియా నాయర్..?
మహారాష్ట్ర కొల్హాపూర్‌లో మలయాళీ కుటుంబంలో ప్రియా నాయర్ జన్మించారు. ఆమె చదువంతా ముంబైలోనే సాగింది. ముంబైలోని సిడెన్హామ్ కళాశాల నుండి అకౌంట్స్ అండ్ స్టాటిస్టిక్స్‌లో బీకామ్ పట్టా పొందారు. ఆ తర్వాత పూణెలోని సింబియోసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ నుంచి మార్కెటింగ్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. తర్వాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ పూర్తి చేశారు.
దాదాపు 30 ఏళ్లుగా హిందుస్థాన్ యూనిలీవర్‌కు ప్రియా నాయర్ సేవలందిస్తున్నారు. 1995లో హెచ్‌యూఎల్‌లో చేరారు. సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాల్లో విధులు నిర్వహించారు. హోమ్ కేర్, బ్యూటీ, పర్సనల్ కేర్ వంటి విభాగాల్లో నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె సారథ్యంలో హోమ్‌కేర్ విభాగం 2014 -2020లో భారీ వృద్ధిని నమోదు చేసుకున్నది. సంస్థ కీలక ఉత్పత్తులైన డౌవ్, రిన్, కంఫర్ట్ వంటి ఉత్పత్తులకు 1998లో బ్రాండ్ మేనేజర్‌గా నియమితులయ్యారు.
లాండ్రీ బిజినెస్‌కు నాయకత్వం వహించారు. ఓరల్ కేర్, డియోడరెంట్స్, కస్టమర్ డెవలప్మెంట్ విభాగాలను కూడా నిర్వహించారు. 2020 నుంచి 2022 వరకు బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. తర్వాత యూనిలీవర్లో బ్యూటీ, వెల్బీయింగ్ విభాగానికి గ్లోబల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా, 2023 నుంచి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Also Read..
Tesla | జులై 15న భారత్‌లో టెస్లా తొలి షోరూం ప్రారంభం..!
జీహెచ్ఐఏఎల్ చేతికి జీఎమ్మార్ లాజిస్టిక్స్
అమ్మకానికి ఎల్ఐసీ వాటా.. ఇప్పటికే ఐపీవో కోసం 3.5% వాటా విక్రయం