WhatsApp | ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వినియోగిస్తున్న ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. మెటా యాజమాన్యంలోని ఈ యాప్‌కు కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. ఈ క్రమంలో యూజర్ల ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తుంది. గోప్యత, భద్రతను మెరుగుపరిచేందుకు.. కంపెనీ అప్డేట్స్ను తీసుకువస్తుంది. తాజాగా వాట్సాప్ కొత్తగా ఐదు ఫీచర్స్‌ను తీసుకువచ్చింది. ఈ ఫీచర్స్ యాప్‌ని మరింత సౌకర్యవంతంగా మార్చనున్నాయి. గత కొద్ది నెలలు అనేక ఫీచర్స్‌ను వాట్సాప్ టెస్ట్ చేస్తుంది. పలు ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అవేంటో తెలుసుకుందాం పదండి..!
వాట్సాప్‌లో యూజర్లు తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకునేందుకు.. చాటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇంప్రూవ్ చేసేందుకు ‘చాట్ థీమ్’ స్పెసిఫికేషన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. దాంతో యూజర్లు నచ్చిన కలర్లో చాట్‌ను సెట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మొన్నటి వరకు చాట్ స్క్రీన్ థీమ్ కేవలం ఒకే రంగులో అందుబాటులో ఉండగా.. అవతలి యూజర్స్ పంపే సందేశాలు కేవలం వైట్ కలర్లో కనిపించేవి. యూజర్ సెండ్ చేసే మెసేజ్మాత్రం గ్రీన్ కలర్లో ఉండేవి.. మిగతా ప్లాట్‌ఫామ్స్‌లో ఇలాంటి చాట్ థీమ్స్ మార్చుకునే అవకాశం ఉండేది. తాజాగా వాట్సాప్ సైతం కస్టమైజ్డ్ ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.
వాట్సాప్‌లో చాలామందికి కుప్పలు తెప్పలుగా సందేశాలు వస్తుంటాయి. చాలామంది వాటిని చదవకుండా అలాగే వదిలేస్తుంటారు. యూజర్లు చదవని మెసేజ్ మెసేజ్‌లకు సంబంధించిన నోటిఫికేషన్ డాట్ కారణంగా చిరాకుపడుతుంటారు. చదవకుండా వదిలేసిన మెసేజ్ సమస్యను అధిగమించేందుకు వాట్సాప్ క్లియర్ చాట్ నోటిఫికేషన్ ఫీచర్‌ను జోడించింది. యూజర్లు నోటిఫికేషన్ సెట్టింగ్స్‌కు వెళ్లి తమకు నచ్చినట్లుగా నోటిఫికేషన్స్‌లో మార్పులు చేసుకునేలా వీలు కల్పించింది.
వాట్సాప్ గతేడాది చాట్ ఫిల్టర్‌ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. దాంతో మెసేజ్‌లను నిర్వహించడం సులభతరం చేసింది. తాజాగా వాట్సాప్ ఈ ఫీచర్‌కు చాట్ కౌంటర్ ఫీచర్‌ను జోడించింది. దాంతో యూజర్లు చాట్ ఫిల్టర్‌లో ఎన్ని మెసేజ్‌లు చదవనివి ఉన్నాయో నేరుగా తెలుసుకోవచ్చు. తద్వారా ఏదైనా ముఖ్యమైన మెసేజ్‌ను మిస్‌కాకుండా ఉంటుంది.
యూజర్లు చాలాకాలంగా ఎదురుచూస్తున్న వీడియో ప్లేబ్యాక్ స్పీడ్ సర్దుబాటు ఫీచర్‌ను వాట్సాప్ విడుదల చేసింది. గతంలో ఈ ఫీచర్ వాయిస్ నోట్స్ కోసం మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ, ప్రస్తుతం యూజర్లు 1.5x లేదంటే.. 2x వేగంతో వీడియోలను కూడా చూడవచ్చు. వాట్సాప్‌లో షేర్ చేసిన వీడియోలను త్వరగా చూడాలనుకునే యూజర్లు ప్రత్యేకంగా ఉపయోగపడుతున్నది.
వాట్సాప్‌లో మెటా ఏఐ చాట్‌బాట్‌ను వాట్సాప్ పరిచయం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏఐని మరింత లోతుగా అనుసంధానిస్తున్నది. యూజర్లు ఇప్పుడు వారి ఫోన్ హోమ్ స్క్రీన్కు మెటా ఏఐ విడ్జెట్‌ను జోడించొచ్చు. WhatsApp AI చాట్‌బాట్‌కు ఇన్స్టంట్ యాక్సెస్ ఇస్తుంది. ఇందు కోసం పర్సనలైజేషన్ ఓపెన్ చేసి.. విడ్జెట్ కేటగిరిలోకి వెళ్లాలి. అందులో హోమ్ స్క్రీన్కు Meta AI విడ్జెట్‌ను జోడించుకోవచ్చు. దాంతో కేవలం ఒకే ఒక్క ట్యాప్‌తో Meta AI చాట్‌బాట్ ఓపెన్ అయ్యి.. యూజర్లు సహాయం అందిస్తుంది.