WhatsApp | ఐఓఎస్ యూజర్లకు వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్పెషల్ సపోర్ట్ చాట్ ద్వారా ఏఐ యూజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నది. ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ యాప్ తాజా వెర్షన్‌లోకి రాగా.. రాబోయే వారాల్లో మిగతా యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఈ సపోర్ట్ చాట్ కోసం మొదట వాట్సాప్ సెట్టింగ్‌లోకి వెళ్లాలి. అందులో హెల్ప్ బటన్‌పై క్లిక్ చేయాలి. అందులో హెల్ప్‌సెంటర్ బటన్‌పై క్లిక్ చేస్తే కాంటాక్ట్ అస్ (WhatsApp Settings > Help > Help Center > Contact Us)పై క్లిక్ చేసి యాక్సెస్ చేయొచ్చు. దాంతో యూజర్లు అధికారిక వాట్సాప్ సపోర్ట్ ఖాతా అని సూచించే మెటా వేరిఫైడ్ బ్లూ టిక్‌తో కొత్త చాట్ విండో ఓపెన్ అవుతుంది.
ఈ చాట్‌లో యూజర్లు అడిగే ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇస్తుంది. ఈ సమాధానాలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మాత్రమే జనరేట్ చేస్తుంది. అయితే, ఈ సమాధానాల్లో కొన్ని తప్పు, లేదా అనుచిత సమాచారం ఉండవచ్చని నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి సమాధానం కిందట Meta AI ఇండికేటర్, టైమ్‌స్టాంప్ సైతం ఉంటుంది. వినియోగదారులు తమ సమస్యలను నేరుగా టెక్స్ట్ ద్వారా, స్క్రీన్షాట్స్ల ద్వారా పంచుకోవచ్చు. రెస్పాన్స్ సైతం వేగంగా ఉంటుంది. ప్రతి చాట్‌కు ఒక సపోర్ట్ టికెట్ నెంబరు కూడా ఇస్తారు. ఈ ఫీచర్ తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. వినియోగదారుడు మానవ సహాయం కోరితే.. సహాయక సిబ్బంది జోక్యం చేసుకుంటారని పేర్కొంటూ యూజర్లకు ఓ ఆటోమేటెడ్ సందేశం కనిపిస్తుంది.