Fake E-Challan | అధునాతన టెక్నాలజీ అభివృద్ధికి పరిమితుల్లేవు.. ఆటంకాలు అంతకన్నా లేవు. రోజురోజుకు అధునాతన టెక్నాలజీతో పలు రకాల సేవలు సులభతరం అవుతున్నాయి. మరోవైపు సైబర్ మోసగాళ్లు.. అమాయకులు మొదలు సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరిని బురిడి కొట్టించి వారు ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ము కొట్టేయడానికి కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. తాజాగా ఇటువంటి సైబర్ ఫ్రాడ్ హర్యానాలో వెలుగు చూసింది. సైబర్ నేరగాళ్లు ట్రాఫిక్ పోలీసుల పేరిట వాహనదారులకు బోగస్ చలానాలు పంపి మనీ స్వాహా చేస్తున్న సంగతి ఆలస్యంగా బయటపడింది.
ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతున్న బోగస్ ఈ-చలాన్ లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హర్యానా సైబర్ క్రైమ్ ఆఫీసర్ హేమేంద్ర కుమార్ మీనా ప్రజలను హెచ్చరించారు. బోగస్ ట్రాఫిక్ పోలీస్ వెబ్సైట్లు ఏర్పాటు చేసి.. సామాన్యులకు ఎంత మాత్రం అనుమానం రాకుండా ఆ వెబ్సైట్ల లింక్‌లు ప్రజలకు పంపుతున్నారు. టెక్ట్స్ మెసేజ్‌ల ద్వారా సైబర్ మోసగాళ్లు పంపుతున్న లింక్‌లు హానికరమైనవని, ప్రజల డబ్బు దొంగిలించేందుకు రూపొందించినవేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మీరు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారంటూ ఒక టెక్ట్స్ మెసేజ్ వస్తుంది. అందుకోసం మీకు పంపే లింక్ ద్వారా ఫైన్ చెల్లించాలని చెబుతుంది. మీకు వచ్చిన ఆ లింక్ ఓపెన్ చేస్తే.. ఫేక్ ట్రాఫిక్ పోలీస్ వెబ్సైట్లోకి తీసుకెళుతుంది. ఆన్లైన్లో మీ బ్యాంక్ ఖాతా డిటైల్స్ ఇవ్వమని సందేశం వస్తుంది. అలా అడిగిన ఖాతా వివరాలు పేర్కొన్న మరుక్షణం మీ ఫోన్, కంప్యూటర్, టాబ్లెట్.. సైబర్ మోసగాళ్ల కంట్రోల్లోకి వెళ్లిపోయినట్లే.
ట్రాఫిక్ పోలీసుల నుంచి పంపుతున్నట్లు వచ్చే టెక్ట్స్ మెసేజ్‌లు, ఈ-మెయిల్స్‌తో కూడిన లింక్‌ను క్లిక్ చేయొద్దని పోలీసులు, ప్రభుత్వం చెబుతున్నాయి. ఇటువంటి మోసాల పట్ల విజిలెంట్‌గా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.
వాహనాల ఈ-చలాన్ వివరాలు తెలుసుకోవాలంటే మీరు కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ https://echallan.parivahan.gov.in/లోకి వెళ్లి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫేక్, రియల్ ఈ-చలాన్ మెసేజ్‌కి ప్రధానమైన తేడా ఉంటుంది. ట్రాఫిక్ పోలీసులు పంపే ఈ-చలాన్లో మీ పేరు, వాహనం నంబర్, ఇంజిన్, చేసిస్ నంబర్ ఉంటాయి. కానీ ఫేక్ ఈ-చలాన్‌పై అటువంటివేవీ ఉండవు. ఇంకా వెబ్సైట్ ప్రభుత్వ శాఖలు నిర్వహిస్తున్నట్లయితే చివర్లో `gov.in` డొమైన్‌తో వస్తుంది. gov.in డొమైన్ ఉన్న వెబ్సైట్ లింక్‌పై మాత్రమే ఈ-చలాన్ చెల్లింపులు జరుపాలని పోలీసులు సూచిస్తున్నారు.