Gold | దీపావళి పండుగ వేళ చాలామంది బంగారం కొంటూంటారు. ఇంకా చెప్పాలంటే మన దేశంలో ఇదో సంప్రదాయం.. అంతకుమించి ఓ సెంటిమెంట్. అవును.. ఈ పండక్కి పుత్తడి కొంటే లక్ష్మీ కటాక్షం దక్కినట్టేనని ఎంతోమంది నమ్మకం మరి. అయితే ఒకప్పటితో పోల్చితే ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల మోసాలు జరుగుతున్నాయి. అమాయక కొనుగోలుదారులకు తక్కువ క్యారెట్ బంగారం అప్పజెప్పి ఎక్కువ సొమ్ము దండుకుంటున్న సంఘటనల్ని చూస్తూనే ఉన్నాం. అందుకే బంగారం నాణ్యతను తెలియజేసే ఎన్నో ప్రమాణాలను తీసుకొచ్చారు. అందులో ప్రధానమైనదే గోల్డ్ హాల్‌మార్కింగ్.
ఇదీ సంగతి..
పసిడి కొనుగోలుదారుల్లో నమ్మకాన్ని పెంచేందుకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) పరిచయం చేసినదే ఈ గోల్డ్ హాల్‌మార్కింగ్ ప్రక్రియ. నగలు, నాణేలు, కడ్డీలు ఇతరత్రా బంగారు ఉత్పత్తుల నాణ్యతను తెలియపర్చడంలో ఇది చాలా ప్రధానం. దీని ప్రకారం ప్రతీ నగపై బీఐఎస్ మార్క్, బంగారం నాణ్యతను తెలియజేసే 22 క్యారెట్ 916 ప్రమాణం, 6 అంకెల డిజిటల్ హాల్‌మార్కింగ్ యూనిక్ ఐడీ (హెచ్‌యూఐడీ)లు ఉంటాయి. ఒక ఆభరణం మీద ఉన్న ఐడీ మరొక ఆభరణం మీద ఉండదు. సులభంగా ఆ ఐడీతో అన్ని వివరాలు తెలుస్తాయి. ఈ హాల్‌మార్కింగ్‌ను కేంద్ర ప్రభుత్వం నగల అమ్మకందారులందరికీ తప్పనిసరి చేసింది.
బీఐఎస్ హాల్‌మార్క్
ఇది మీరు కొనే బంగారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ద్వారా నిర్వహించే లైసెన్స్డ్ లాబొరేటరీలో పరిశీలించబడినది అన్నదాన్ని సూచిస్తుంది. అలాగే ఇవి తాము అమ్మిన బంగారు ఆభరణాలని సూచించేలా కొందరు జ్యుయెల్లర్స్ తమ సొంత యూనిక్ ఐడెంటిఫికేషన్ మార్క్లనూ నగలపై వేస్తున్నారు. సాధారణంగా వారి బ్రాండ్లు, దుకాణాల పేర్లతో ఇవి ముడిపడి ఉంటున్నాయి.
బంగారం నాణ్యత
హాల్మార్క్యూనిక్ ఐడీ
చార్జీలు ఇలా..
మన దగ్గరుండే పాత బంగారు ఆభరణాలకూ హాల్‌మార్కింగ్ చేయించుకోవచ్చు. బీఐఎస్ నమోదిత జ్యుయెల్లర్స్ వద్దకు వెళ్లి వారి ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. లేదా బీఐఎస్ గుర్తించిన అస్సేయింగ్ అండ్ హాల్‌మార్కింగ్ సెంటర్ల (ఏహెచ్‌సీ)కు వెళ్లి అక్కడ ఈ పనిని చేసుకోవచ్చు. మీ నగల నాణ్యతను పరిశీలించిన తర్వాతే హాల్‌మార్కింగ్ జరుగుతుంది. చార్జీలు ఒక్కో బంగారు ఆభరణానికి రూ.45గా తీసుకుంటారు. వెండి వస్తువులకూ ఉంటుంది. అందుకు రూ.35 తీసుకుంటారు. కన్సైన్మెంట్ కోసమైతే కనీస చార్జీ బంగారానికి రూ.200, వెండికి రూ.150గా ఉంటుంది. వీటికి సర్వీస్ ట్యాక్స్, ఇతర చార్జీలు అదనం. బరువుతో సంబంధం లేకుండా ఈ చార్జీలు పడుతాయి. కొత్తవి షాపుల్లో కొంటున్నప్పుడైతే తయారీ, మజూరీ (మేకింగ్, వేస్టింగ్) చార్జీల్లో ఈ హాల్‌మార్క్ చార్జీలు కలువవు. వీటిని వేరుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక గతంలో నాలుగైదు సంకేతాలతో హాల్‌మార్కింగ్ ఉండేది. అదిప్పుడు మూడుకు తగ్గింది. కాబట్టి పాత హాల్మార్కింగ్కూ విలువ ఉంటుంది. అందులో హెచ్‌యూఐడీ లేదని ఆందోళన చెందనక్కర్లేదు.
ప్యూరిటీ
బంగారం నాణ్యతను క్యారెట్లలో కొలుస్తారు. 24 క్యారెట్ (99.9%) అంటే పూర్తిగా స్వచ్ఛమైన బంగారమే. మార్కెట్లో ఇది బిస్కట్లు, కడ్డీలు, నాణేల రూపంలో లభిస్తుంది. 22 క్యారెట్ (22K916) అంటే అందులో 91.6 శాతం నాణ్యమైన బంగారం ఉంటుందన్నమాట. మనం కొనే ఆభరణాలు ఈ నాణ్యతతోనే ఉంటాయి. అచ్చంగా పసిడితోనే నగలు తయారుకావు. అందుకే రాగి, ఇతరత్రా లోహాలను కలపాల్సి ఉంటుంది. దానివల్ల నాణ్యత కొంత తగ్గుతుంది. ఇక 18 క్యారెట్ (18K750) అంటే ఇందులో బంగారం 75 శాతం మాత్రమే ఉంటుంది. మిగతా 25 శాతం ఇతర లోహాలుంటాయి. 14 క్యారెట్ (14K585)లో బంగారం పరిమాణం 58.5 శాతమే. క్యారెట్ ప్రామాణికత తగ్గినకొద్దీ ధరలూ తగ్గుతూంటాయి. అందుకే అత్యధిక ధరను పెట్టి కొనే నగలపై 22K916 ఉంటుందన్నది గుర్తుంచుకోవాలి.