Cibil Score | సిబిల్ స్కోర్.. అంటే ప్రతి ఒక్కరి ఆర్థిక లావాదేవీల తీరును తెలియజేస్తుంది. దాన్నే క్రెడిట్ స్కోర్ అని కూడా అంటారు. దీని ఆధారంగానే ప్రతి ఒక్కరి రుణ పరపతిని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తేల్చేస్తాయి. ఇంటి రుణం అయినా.. ఆటోమొబైల్ లోన్ అయినా, పిల్లల ఉన్నత విద్యా కోర్సులకు అవసరమైన విద్యా రుణమైనా.. వ్యాపార లావాదేవీల విస్తరణకు అవసరమైన వాణిజ్య రుణం అయినా సిబిల్ స్కోర్ ఆధారంగానే బ్యాంకులు ఆయా రుణాలు ఇస్తుంటాయి.
ప్రస్తుతం అంతా డిజిటల్మయం కావడంతో ప్రతి ఒక్కరికీ సిబిల్ (క్రెడిట్) స్కోర్ పట్ల ఇటీవలి కాలంలో అవగాహన పెరిగింది. గతేడాదితో పోలిస్తే సిబిల్ స్కోర్ కోసం పేర్లు నమోదు చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు క్రెడిట్ స్కోర్ కోసం 2,38 కోట్ల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారని సిబిల్ ట్రాన్స్ యూనియన్ పేర్కొంది. దీన్ని బట్టి ఎప్పటికప్పుడు సిబిల్ స్కోర్ అంటే తమ క్రెడిట్ స్కోర్ ఎంత ఉందన్న విషయం చెక్ చేసుకుంటున్నారన్న మాట.
దాదాపు ప్రతి ఒక్కరూ తమకు ఏదైనా లోన్ అవసరమైనప్పుడే సిబిల్ స్కోర్ తనిఖీ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇది తప్పని ఆర్థిక వేత్తలు, ఫైనాన్సియల్ నిపుణులు చెబుతున్నారు. ప్రతి మూడు నెలలకోసారి సిబిల్ స్కోర్ క్రమం తప్పకుండా చెర్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఒక్కోసారి మీ పేరు మీద ఇతరులు రుణాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు. అటువంటి అంశాన్ని చెక్ చేసుకోవడానికి ప్రతినిత్యం సిబిల్ స్కోర్ ఎప్పటికప్పుడు చూసుకోవాలని అంటున్నారు. అలా ఎవరైనా మీ పేరు మీద రుణం తీసుకున్నా.. సంబంధిత బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయడానికి వీలవుతుందని పేర్కొంటున్నారు.
మన సిబిల్ (క్రెడిట్) స్కోర్ బాగానే ఉందని అనుకున్నా, అవసరమైనప్పుడు సమస్యలు తలెత్తవచ్చు. నిత్యం చెక్ చేసుకోవడం వల్ల పొరపాట్లు జరిగి ఉంటే సరిదిద్దుకునే చాన్స్ ఉంటుంది. అలా చెక్ చేసుకున్నా.. మీ క్రెడిట్ స్కోర్ గాడిలో పడటానికి కనీసం తొమ్మిది నెలల టైం పడుతుంది మరి. ఆన్లైన్ లావాదేవీలు పెరిగిపోయిన నేపథ్యంలో కంప్యూటర్లో పొరపాటుగా క్లిక్ చేసుకుంటూ వెళితే లోన్ మంజూరై ఉండవచ్చు. సరిగ్గా చూసుకోకుండా పర్మిట్లు ఇచ్చుకుంటూ పోతే, అవసరమైనప్పుడు చిక్కుల్లో పడతారని నిపుణులు హితవు చెబుతున్నారు. ఒక్కోసారి పేమెంట్స్ మరిచిపోతే క్రెడిట్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.
సిబిల్ స్కోర్ బేష్షుగ్గా ఉంటే సకాలంలో రుణం మంజూరు కావడంతోపాటు తక్కువ వడ్డీరేటు ఇవ్వమని బ్యాంకు వారితో బేరసారాలు చేయొచ్చు. టెక్నికల్ సమస్యల వల్ల ఒక్కోసారి సిబిల్ స్కోర్ అప్డేట్ కాదు. కనుక నిత్యం మీ బ్యాంకు అధికారులను సంప్రదించి అది అప్డేట్ అయ్యేలా చూసుకోవాలి. రుణం కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి సారి బ్యాంకులు మీ సిబిల్ స్కోర్ తనిఖీ చేస్తాయి. మీరు సిబిల్ స్కోర్ ఎంక్వైరీ చేశారా? అన్న సంగతి కూడా తేల్చేస్తాయి. ఇటువంటప్పుడు ఇతరులు మీ సిబిల్ స్కోర్ చెక్ చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక ఎప్పటికప్పుడు సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.