Credit Card | అందరికీ ఇప్పుడు క్రెడిట్ స్కోర్, క్రెడిట్ హిస్టరీలు కీలకమైపోయాయి. పర్సనల్ బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుతం ఈ రెండింటి ఆధారంగానే మెజారిటీ లావాదేవీలు జరుగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు వాటికున్న ప్రాధాన్యం ఏమిటన్నది? అయితే మీరెక్కడా ఇప్పటిదాకా రుణాలు తీసుకోకుంటే మీకు రుణ చరిత్రే (క్రెడిట్ హిస్టరీ) ఉండదు. రుణ ఎగవేతలున్నా క్రెడిట్ స్కోర్ బాగుండదు. అప్పుడు మీ లోన్ అప్లికేషన్లు, మీరు పెట్టుకున్న క్రెడిట్ కార్డ్ విజ్ఞప్తులు తప్పకుండా తిరస్కరణకు గురవుతాయి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి?
క్రెడిట్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ బాగాలేనివారి ఆర్థిక అవసరాలకు సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు ఓ చక్కని పరిష్కార మార్గమని చెప్పవచ్చు. రుణ చరిత్ర, క్రెడిట్ స్కోర్లతో సంబంధం లేకుండా బ్యాంకులు ఈ సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులను జారీ చేస్తాయి.
సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులను నగదు పూచీకత్తుపైనే జారీ చేస్తారన్నది గుర్తుంచుకోవాలి. సహజంగా క్రెడిట్ కార్డు బకాయిల చెల్లింపుల్లో ఎగవేతలకు ఆస్కారమున్నప్పుడు బ్యాంకర్లు తమ రక్షణార్థం వీటిని కస్టమర్లకు ఇస్తూంటారు. దీనివల్ల కస్టమర్లు క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించలేకపోయినా బ్యాంకులకు నష్టం వాటిల్లదు. కార్డు కోసం పూచీకత్తుగా పెట్టిన నగదును ఆ బకాయిల కింద జమ చేసుకునే వెసులుబాటు ఉండటమే కారణం. కాబట్టి ఇలాంటి కస్టమర్ల విషయంలో బ్యాంకులు సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఇక కార్డు పరిమితి రూ.50,000 కావాలనుకుంటే, అంతే మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. రూ.3 లక్షలు లేదా రూ.5 లక్షలు కావాలన్నా.. అంతే మొత్తాలు డిపాజిట్ చేయాలి. ఒక్కమాటలో చెప్పాలంటే మీరు చేసే డిపాజిట్లనుబట్టే మీరు పొందే క్రెడిట్ కార్డుకున్న రుణ పరిమితులు ఆధారపడి ఉంటాయి.