ముంబై : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దేశీయ మదుపరులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత నెల 28 నుంచి ఇప్పటి వరకు బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 10 శాతం లేదా 8,590.8 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 2,666 పాయింట్లు లేదా 10.58 శాతం చొప్పున పతనం చెందింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.48,29,041.45 కోట్లు కరిగిపోయి రూ.4,15,21,629.82 కోట్ల కు జారుకున్నది.
మార్కెట్ల నష్టాలు సోమవారం కూడా కొనసాగాయి. ఇంట్రాడేలో 2 వేల పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 1,836.57 పాయింట్లు నష్టపోయి 72,696.39 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 601.85 పాయింట్లు లేదా 2.60 శాతం కోల్పోయి 22,512.65 వద్ద స్థిరపడింది.