ఆటోకు వార్ దెబ్బ.. దేశీయ పరిశ్రమకు సవాళ్లేనంటున్న సియామ్
పశ్చిమాసియాను కుదిపేస్తున్న అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో దేశీయ ఆటోమోటివ్ పరిశ్రమకు తీవ్ర ఇబ్బందులే ఎదురుకావచ్చని మంగళవారం భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సమాజం (సియామ్) అధ్యక్షుడు శైలేష్ చంద్ర అన్నారు.
- పెరుగుతున్న రవాణా వ్యయం
- సరఫరా సమస్యలతో ముడి సరుకు కొరత
- వాహనాల ధరలు పెరిగే అవకాశాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 14 : పశ్చిమాసియాను కుదిపేస్తున్న అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో దేశీయ ఆటోమోటివ్ పరిశ్రమకు తీవ్ర ఇబ్బందులే ఎదురుకావచ్చని మంగళవారం భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సమాజం (సియామ్) అధ్యక్షుడు శైలేష్ చంద్ర అన్నారు. వాహనాల డిమాండ్‌పై పరోక్ష ప్రభావం ఉండొచ్చని 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు. ‘మిడిల్ ఈస్ట్ సంక్షోభం నుంచి తలెత్తిన అనిశ్చిత పరిస్థితులను నిశితంగా గమనించాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుత భౌగోళిక, రాజకీయ పరిస్థితులను చూస్తే.. ఆటోమోటివ్ ఉత్పాదకత చిక్కుల్లో పడవచ్చు. విడిభాగాల ధరలు, ఇంధన చార్జీలు, రవాణా ఖర్చులు సమీప కాలంలో ఆటో ఇండస్ట్రీకి సవాల్‌గా మారగలవనిపిస్తున్నది’ అని చెప్పారు.
ముడి సరుకు కొరత
గల్ఫ్ వార్తో భారతీయ ఆటో ఇండస్ట్రీకి ముడి సరుకుల కొరత రావచ్చని శైలేష్ హెచ్చరించారు. ముఖ్యంగా పెట్రో కెమికల్స్ తయారీలో వినియోగించే ప్రొపేన్, ఇథిలీన్ సరఫరాలో సమస్యలు ఏర్పడవచ్చని, అలాగే వాహనాలకు వేసే రంగుల తయారీ కూడా చిక్కుల్లో పడవచ్చన్నారు. తద్వారా మార్కెట్లో వాహనాల డిమాండ్ ప్రభావితం కావచ్చని పేర్కొన్నారు.
రవాణాపరంగా..
వార్‌లో అమెరికా-ఇజ్రాయెల్‌కు మద్దతిస్తున్నారని పొరుగు దేశాలపై ఇరాన్ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆయా దేశాల్లో ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తికి దాదాపుగా బ్రేకులుపడ్డాయి. అంతేగాక గల్ఫ్ దేశాల నుంచి భారత్ సహా ఇతర దేశాలకు జరిగే రవాణాలో కీలకమైన హొర్ముజ్ జలసంధిని ఇరాన్ ఇంచుమించుగా మూసివేయడంతో నౌకాయానం సమస్యల్లో పడింది. చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొనడంతో దూరం పెరిగి రవాణా సమయం, వ్యయం మితిమీరిపోతున్నదని శైలేష్ అంటున్నారు. అలాగే షిప్పింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలూ పెరిగిపోతున్నాయి. అంతిమంగా దిగుమతిదారులపైనే ఈ భారం పడుతుండగా.. ఇది ఆయా ఉత్పత్తుల ధరల పెరుగులకు దారితీస్తున్నది. ఈ క్రమంలోనే రాబోయే 4-5 వారాల్లో ఆయా కంపెనీలు వివిధ వాహనాల ధరల్ని పెంచే అవకాశాలూ లేకపోలేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలు సంస్థలు ఆయా మాడళ్ల రేట్లను పెంచిన సంగతి విదితమే. కాగా, పెరిగే పెట్రోల్, డీజిల్, సీఎన్జీ తదితర ఇంధన ధరలతోనూ వాహనాల అమ్మకాలు పడిపోవచ్చన్న ఆందోళన ఇండస్ట్రీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది.
హోల్‌సేల్స్ అదుర్స్
దేశీయంగా ఆటోమొబైల్ హోల్‌సేల్స్ గత ఆర్థిక సంవత్సరం (2025-26) రికార్డు స్థాయిలో 2,82,65,519 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2,56,09,399 యూనిట్లు)తో చూస్తే 10.4 శాతం పెరిగాయని సియామ్ తాజాగా తెలిపింది. ప్యాసింజర్, కమర్షియల్, టూవీలర్, త్రీవీలర్ విభాగాల్లో ఆకర్షణీయ అమ్మకాలు కనిపించాయని సియామ్ అధ్యక్షుడు శైలేష్ చంద్ర తెలియజేశారు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంతలా వాహనాల విక్రయాలు నమోదు కావడం ఇదేనన్నారు. కాగా, దిగుమతి సుంకాల పెంపుతో మెక్సికోకు, యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు భారతీయ వాహనాల ఎగుమతులు తగ్గిపోవచ్చని శైలేష్ ఈ సందర్భంగా అంచనా వేశారు. దేశీయ ప్యాసింజర్ వాహనాల ఎగుమతుల్లో మెక్సికో, మిడిల్ ఈస్ట్ దేశాల వాటా దాదాపు 20-22 శాతంగా ఉంటుందన్నారు. గత ఆర్థిక సంవత్సరం దేశీయ మొత్తం వాహనాల ఎగుమతులు 66,47,685 యూనిట్లుగా ఉన్నాయని వివరించారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2024-25) 53,62,884 యూనిట్లేనని, 24 శాతం పెరిగాయని శైలేష్ పేర్కొన్నారు.
- 2025-26లో ప్యాసింజర్ వాహనాల (కార్లు ఇతరత్రా) హోల్‌సేల్స్ 7.9 శాతం పెరిగి 46,43,439 యూనిట్లుగా నమోదు. 2024-25లో 43,01,848 యూనిట్లకే పరిమితం.
- గత ఆర్థిక సంవత్సరం టూవీలర్ హోల్‌సేల్స్ 10.7 శాతం ఎగిసి 2,17,05,974 యూనిట్లకు చేరిక. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 1,96,07,332 యూనిట్లు.
- 6.6 శాతం ఎగబాకి 1,30,64,789 యూనిట్లుగా మోటర్‌సైకిళ్ల అమ్మకాలు. మునుపు 1,22,52,305 యూనిట్లే. 18.5 శాతం వృద్ధితో 81,17,945 యూనిట్ల నుంచి 68,53,214 యూనిట్లకు స్కూటర్ విక్రయాలు.
- వాణిజ్య వాహనాల హోల్‌సేల్స్ గత ఆర్థిక సంవత్సరం 10,79,875 యూనిట్లుగా ఉంటే.. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 9,58,679 యూనిట్లు. పెరుగుదల 12.6 శాతం.
- త్రీవీలర్ హోల్‌సేల్స్ 7,41,420 యూనిట్ల నుంచి 8,36,231 యూనిట్లకు పెరుగుదల. 2024-25తో పోల్చితే 2025-26లో 12.8 శాతం వృద్ధిరేటు నమోదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

