C4IR | హైదరాబాద్‌లో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రీయల్ రెవల్యూషన్ (C4IR) ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. బయో ఏషియా–2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఈ సెంటర్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచే సాంకేతిక ఆధారిత కార్యక్రమం రూపుదిద్దుకుంటుంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే ప్రతినిధి బృందంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. అనంతరం సంయుక్తంగా ఈ ప్రకటన చేశారు. నిజానికి గత ఏడాది జరిగిన డబ్ల్యూఈఎఫ్ సదస్సులోనే ఈ ఒప్పందం జరిగింది. అప్పటి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్ జెరేమీ జర్గన్స్, రాష్ట్ర ప్రభుత్వ లైఫ్ సెన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్ సంతకాలు చేశారు. తాజాగా ఈ సీ4ఐఆర్.. ప్రారంభానికి సిద్ధమైంది.
‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విశాల దృక్పథం, నిర్దేశించుకున్న లక్ష్యాలన్నీ తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయి. అందుకే రెండింటి మధ్య అద్భుతమైన సమన్వయం కుదిరింది. జీవన విధానాలు, జీవన నాణ్యత ప్రమాణాలు మెరుగుపరిస్తే ప్రజల జీవితాలు బాగుపడుతాయనే ఆలోచనల సారూప్యతకు కట్టుబడి ఉన్నాం. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రపంచ స్థాయిలో పని చేస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలపై దృష్టి కేంద్రీకరిస్తోంది. ఇరువురి భాగస్వామ్యంతో ప్రజల ఆరోగ్యం, సాంకేతికత, మంచి జీవితం అందించాలనే లక్ష్యాలను వేగంగా అందుకోవచ్చు..’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘ప్రపంచ స్థాయిలో ఆరోగ్య సంరక్షణ విధానాలను సరికొత్తగా పునర్నిర్వించే ఆలోచనలున్నాయి. చిన్న పట్టణాలు, గ్రామాలకు ఈ సేవలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది..’ అని సీఎం అన్నారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ (4IR) నెట్వర్క్ అయిదు ఖండాలలో విస్తరించింది. C4IR తెలంగాణ సెంటర్.. ప్రపంచంలో 19వది. హెల్త్‌కేర్ మరియు లైఫ్ సైన్సెస్ నేపథ్యంతో ఉన్న మొదటి కేంద్రం హైదరాబాద్‌లోనే ప్రారంభం కానుంది. ఆసియాలోనే తెలంగాణ ప్రముఖ లైఫ్ సైన్సెస్ హాట్‌స్పాట్‌గా పరిగణిస్తారు. దీనికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఇది లాభాపేక్ష లేని సంస్థ. ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ కోసం పాలసీ, పాలనపై నాయకత్వం వహిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఇంక్యుబేటర్ల ద్వారా రాబోయే 5 సంవత్సరాలలో 20,000 స్టార్టప్‌లపై ప్రభావం చూపాలని లక్ష్యంగా పెట్టుకుంది.