Wedding Business | పెండ్లంటే ఏడడుగులు.. నూరేండ్ల జీవితం.. వెయ్యేండ్ల పంట.. పెండ్లంటే వధూ వరుల కోసం.. వారి కుటుంబాల కోసం కొత్త వస్త్రాలు.. నవ వధూ వరులకు బంగారం ఆభరణాల కొనుగోళ్లు తప్పనిసరి.. పెండ్లికి హాజరై దీవించే అతిధులకు భోజన వసతి కల్పించడం ఇరు కుటుంబాల బాధ్యత. ప్రతిదీ మనీతో ముడి పడిన ప్రస్తుత పరిస్థితుల్లో వెడ్డింగ్ బిజినెస్ దేశంలో నాలుగో అతిపెద్ద పరిశ్రమగా నిలిచింది. మధ్య తరగతి ప్రజల ఆదాయం పెరగడం, శరవేగంగా పట్టణీకరణ జరుగుతుండటమే ప్రధాన కారణం. గతేడాది పెండ్లిండ్ల పరిశ్రమ బిజినెస్ 26.4 శాతం పెరిగి రూ.4.74 లక్షల కోట్లకు చేరింది. వెడ్డింగ్ ప్లానింగ్ ప్లాట్ ఫామ్ ‘వెడ్మిగుడ్’.. నివేదిక ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశంలోని వెడ్డింగ్ ఇండస్ట్రీ 7-8 శాతం పెరిగి సుమారు రూ.6.25 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా.
మకర సంక్రాంతి తర్వాత ఈ నెల 16 నుంచి దేశంలో వివాహాల సీజన్ ప్రారంభమైంది. వచ్చే మార్చి నెలాఖరు వరకూ సుమారు 30 అత్యంత పవిత్రమైన వివాహ ముహూర్తాలు ఉన్నాయి. ఈ ముహూర్తాల్లో లక్షల జంటలు ఒక్కటి కానున్నాయి. ఈ వివాహాల కోసం యావత్ పరిశ్రమ అంతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. గత కొన్నేండ్లుగా భారతీయ వెడ్డింగ్ పరిశ్రమ శరవేగంగా పెరుగుతున్నది.
భారతీయ వినియోగదారుడి కొనుగోలు శక్తి పెరిగి పోతున్నదని వెడ్మి గుడ్ కో ఫౌండర్ మెహక్ సాగర్ షహానీ పేర్కొన్నారు. డిస్టినేషన్ వెడ్డింగ్ కోసం గత ఏడాది కాలంలో డిమాండ్ పెరిగిపోయింది. దీంతో వెడ్డింగ్ ప్రొఫెషనల్స్ గ్రోత్ 15-22 శాతం పెరుగుతున్నది. 2022లో మొత్తం పెండ్లిండ్లలో 18 శాతం డిస్టినేషన్ వెడ్డింగ్స్ జరిగితే, 2023లో అది 21 శాతానికి పెరిగింది. బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ కోసం ప్రత్యేకంగా హోటళ్లు సిద్ధం అవుతున్నాయి. రాడిసన్ హోటల్ గ్రూప్ ప్రత్యేకంగా ‘డెడికేటెడ్ వెడ్డింగ్ కాన్సెప్ట్’ క్రియేట్ చేసింది.