ముంబై, ఆగస్టు 20: కరోనా వైరస్‌తో తలెత్తిన అనిశ్చిత వాతావరణం నేపథ్యంలో ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తూనే.. వృద్ధికి ఊతమిస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం వివరాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఇటీవలే ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఇందులో కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా ఉంచారు. ఈ సందర్భంగా కమిటీ చర్చించిన అంశాలు, నిర్ణయాల పూర్తి సమాచారం తాజాగా ‘మినిట్స్’ ద్వారా తెలియవచ్చింది. దీని ప్రకారం ‘ఆర్బీఐ ముందు రెండు ప్రధాన అంశాలున్నాయి. ఒకటి దేశ ఆర్థిక వ్యవస్థకు మద్దతును కొనసాగించడం, రెండోది మళ్లీ విజృంభిస్తున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం’ అని దాస్ అన్నారు. రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను చారిత్రక స్థాయికి తగ్గించిన ఆర్బీఐ.. గతేడాది నుంచి వాటిని యథాతథంగానే ఉంచుతూ వస్తున్నది. ఈ నెలలో జరిగిన సమీక్షలోనూ వాటి జోలికి వెళ్లలేదు. అయితే ద్రవ్యోల్బణం పెరుగుతుండటం ఆర్బీఐకి ఇప్పుడు మానిటరీ పాలసీని సాధారణ స్థాయికి తీసుకురావాలన్న సంకేతాలనిస్తున్నది. ద్రవ్యవ్యవస్థలో కరెన్సీ ప్రవాహాన్ని రెపో, రివర్స్ రెపోల సవరణ ద్వారానే ఆర్బీఐ అదుపులోకి తెస్తుందన్నది తెలిసిందే. తద్వారానే ధరల నియంత్రణను చేయగలుగుతుంది. కానీ కరోనా కారణంగా రెపో రేటును తగ్గిస్తూపోయిన ఆర్బీఐ.. చాలాకాలం నుంచి వాటిని తాకడం లేదు. ఫలితంగా అటు రిటైల్ ద్రవ్యోల్బణం, ఇటు హోల్‌సేల్ ద్రవ్యోల్బణం తిరిగి పెరుగుతున్నాయి. అయినప్పటికీ వృద్ధికి ఊతమిస్తామని, ఇదే సమయంలో ద్రవ్యోల్బణం కట్టడికీ ప్రాధాన్యత ఇస్తామని ఆర్బీఐ చెప్తున్నది.