Warren Buffett |న్యూఢిల్లీ, నవంబర్ 24: దేశీయ పేమెంట్ అగ్రిగేటర్ పేటీఎం నుంచి ప్రపంచ ప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ పూర్తిగా వైదొలిగారు. బఫెట్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బెర్క్‌షైర్ హాథ్వేకు పేటీఎం మాతృసంస్థ ఒన్97 కమ్యూనికేషన్లో ఉన్న వాటాలన్నింటినీ రూ.1,370 కోట్లకు విక్రయించింది. షేరుకు రూ.877.2 చొప్పున ఈ లావాదేవీ జరిగింది. బెర్క్‌షైర్ హాథ్‌వే యూనిట్ బీహెచ్ ఇంటర్నేషనల్ యూనిట్‌కు పేటీఎంలో 2.46 శాతం (1.56 కోట్ల షేర్లు) వాటా ఉంది.
ఈ వాటాను స్టాక్ ఎక్సేంజీల్లో బల్క్ డీల్స్ ద్వారా మరో రెండు విదేశీ ఫండ్స్ కొనుగోలు చేశాయి. అయితే పేటీఎం పెట్టుబడిలో బెర్క్‌షైర్ రూ.507 కోట్ల వరకూ నష్టం చవిచూసింది. 2018లో సగటున రూ.1,279.7 ధరతో రూ.2,179 కోట్లు పేటీఎం పెట్టుబడి చేయగా, ఒన్97 ఐపీవోలో రూ.2,150 ధరతో కొంత వాటాను విక్రయించి రూ.301 కోట్లు లాభం పొందినప్పటికీ, తాజాగా తక్కువ ధరకు వాటానంతటినీ విక్రయించడంతో రూ.507 కోట్ల నష్టం తెచ్చుకుంది. ఈ కంపెనీ ఐపీవో ధరతో పోలిస్తే ప్రస్తుతం సగానికంటే తక్కువ ధరకు షేరు ట్రేడవుతున్నది. ఈ వార్తతో ఈ షేరు 3.5 శాతం నష్టపోయి రూ.892 వద్ద ముగిసింది.