Warren Buffett : ప్రపంచ దిగ్గజ బిజినెస్ మ్యాన్ వారెన్ బఫెట్ (Warren Buffett) బెర్క్‌షైర్ హాత్వే సీఈవో పదవిని త్వరలో వీడనున్నారు. ఈ మేరకు ఆయన తన రిటైర్మెంట్ ప్రణాళికలను ప్రకటించారు. 2025 ఏడాది చివరికల్లా బెర్క్‌షైర్ సీఈవో పదవి నుంచి వైదొలుగుతానని శనివారం జరిగిన వార్షిక వాటాదారుల సమావేశంలో ఆయన వెల్లడించారు. తన రెండో కుమారుడు హువర్డ్ బఫెట్ కంపెనీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడతారని గ్రెగ్ అబెల్ (Greg Abel) కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తారని ప్రకటించారు.
తన పదవీ విరమణ, గ్రెగ్‌ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించాలనే నిర్ణయాలు తన కుటుంసభ్యులకు తప్ప గ్రెగ్‌కు కూడా తెలియవని బఫెట్ చెప్పారు. బెర్క్‌షైర్ హాత్వేను నడిపించడానికి అబెల్ సరిపోతారని చాలామంది పెట్టుబడిదారులు నమ్ముతున్నప్పటికీ, అతడు పెట్టుబడులను ఎలా డీల్ చేయగలడనే అనుమానాలను పలువురు లేవనెత్తారని అన్నారు. అయితే అతడి పనితీరుపై తనకు నమ్మకం ఉందని, తన సంపదను కంపెనీలో పెట్టుబడిగా ఉంచుతానని బఫెట్ హామీ ఇచ్చారు.
తాను సీఈవోగా ఉన్నప్పటి కంటే గ్రెగ్ సీఈవోగా ఉన్నప్పుడు అతడి నేతృత్వంలో బెర్క్‌షైర్‌లో అవకాశాలు మెరుగ్గా ఉంటాయని తాను నమ్ముతున్నానని బఫెట్ చెప్పారు.