న్యూఢిల్లీ : అంతర్జాతీయ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ అమెరికాలో మూడు టెక్ హబ్స్‌ను మూసివేయాలని నిర్ణయించింది. ఉద్యోగాలు కాపాడుకోవాలంటే స్ధానచలనం తప్పదని ఉద్యోగులకు వాల్‌మార్ట్ స్పష్టం చేసిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం వెల్లడించింది. అస్టిన్, టెక్సాస్, కార్ల్బద్, కాలిఫోర్నియా, పోర్ట్లాండ్, ఒరెగాన్లోని టెక్ ఆఫీసులను మూసివేయనున్నట్టు వాల్‌మార్ట్ గ్లోబల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సురేష్ కుమార్ ఉద్యోగులకు జారీ చేసిన మెమోలో పేర్కొన్నారు.
ఈ లొకేషన్స్‌లోని ఉద్యోగులు తమ జాబ్‌లను కాపాడుకోవాలంటే ఇతర లొకేషన్స్‌కు మారేందుకు సిద్ధం కావాలని స్పష్టం చేశారు. వాల్‌మార్ట్ ప్రధాన కార్యాలయాలున్న శాన్ బ్రునో, బెంటోన్విల్లే వంటి ప్రాంతాల్లో పనిచేసేందుకు అంగీకరించాలని తేల్చిచెప్పారు. కార్యాలయాలను మూసివేసిన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో అత్యధికులను వేరే ప్రాంతాలకు తరలిస్తామని, మరికొందరికీ ఎప్పటికీ రిమోట్ వర్కింగ్‌కు అవకాశం కల్పిస్తామని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు.
ఎంపిక చేసిన ప్రాంతాల్లో టెక్ టీమ్‌లను కేంద్రీకరించేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే ఉద్యోగులు ఒక్కసారిగా ఇతర లొకేషన్స్‌కు వెళ్లడం సంక్లిష్టమే అయినా లేఆఫ్స్ కంటే ఇది మేలని చెబుతున్నారు. వాల్‌మార్ట్ ప్రత్యర్ధి అమెజాన్ గత నెలలో మాస్ లేఆఫ్స్‌ను ప్రకటించింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 18,000 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించనున్నట్టు ఈ-కామర్స్ దిగ్గజం వెల్లడించిన సంగతి తెలిసిందే.