Volvo C40 Recharge | ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోల్వో ఇండియా (Volvo India) తన ఎలక్ట్రిక్ కారు ‘వోల్వో సీ40 రీచార్జ్ (Volvo C40 Recharge)’ ను వచ్చేనెల నాలుగో తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. దేశీయ మార్కెట్లోకి వోల్వో ఇండియా తీసుకొస్తున్న రెండో ఎలక్ట్రిక్ కారు. ఒకసారి ఫుల్ చార్జింగ్‌తో 530 కి.మీ. దూరం వరకూ ప్రయాణించడం దీని ప్రత్యేకత.
కూపె స్టయిల్డ్ వర్షన్ ‘ఎక్స్‌సీ40 రీచార్జీ’ తరహాలో రూపుదిద్దుకున్న కారు వోల్వో సీ40 రీచార్జీ. ప్రీమియం ఎలక్ట్రిక్ కారు సెగ్మెంట్లో హ్యుండాయ్ ఐయానిక్ 5, కియా ఈవీ6, బీఎండబ్ల్యూ 14, వోల్వో ఎక్స్‌సీ రీచార్జి కార్లతో పోటీ పడుతుందని చెబుతున్నారు.
గత జూన్ 14న భారత్ మార్కెట్లో ‘వోల్వో సీ40 రీచార్జి’ కారును ఆవిష్కరించిన వోల్వో ఇండియా.. కారు డిజైన్, ఫీచర్లు వెల్లడించింది. మార్కెట్లో కారు ఆవిష్కరణతోపాటు బుకింగ్స్ ప్రారంభం అవుతాయని తెలిపింది. సెప్టెంబర్ నుంచే డెలివరీలు ప్రారంభించనున్నది.
వోల్వో సీ40 రీచార్జీ భారత్ వర్షన్ కారు ట్విన్ మోటార్లతో వస్తున్నది. ఈ ట్విన్ మోటార్ గరిష్టంగా 408 పీఎస్ విద్యుత్, 660 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. గరిష్టంగా గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణించే ఈ కారు.. కేవలం 4.7 సెకన్లలో 100 కి.మీ స్పీడ్ అందుకుంటుంది.
గ్లోబల్ మార్కెట్లో రేర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్న వోల్వో సీ40 రీచార్జి కారు భారత్ మార్కెట్లో సింగిల్ మోటార్ ఆప్షన్లతోనూ లభిస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 235 బీహెచ్పీ విద్యుత్, 420 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 7.4 సెకన్లలో 100 కి.మీ స్పీడందుకుంటుంది.
వోల్వో సీ40 రీచార్జీ ఈవీ (Volvo C40 Recharge EV) కారులో 78 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ (78kWh lithium-ion battery) వస్తుంది. 150 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ చార్జర్ సాయంతో 10-80 శాతం చార్జింగ్ కావడానికి 27 నిమిషాల టైం తీసుకుంటుంది. 11 కిలోవాట్ల లెవల్ 2 చార్జర్ సాయంతో ఫుల్ చార్జింగ్ కావడానికి 7-8 గంటల టైం పడుతుంది.
వోల్వో సీ40 రీచార్జీ కారు ఆకర్షణీయంగా, అధునాతనంగా ఉంటుంది. బాడీ కలర్డ్ కవర్డ్ గ్రిల్లె, ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, 19-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, డోర్ మిర్రర్ కవర్స్, హై గ్లాస్ బ్లాక్ సైడ్ విండో ట్రిమ్, లామినేటెడ్ పనోరమిక్ రూఫ్ విత్ ప్రొటెక్టివ్ యూవీ కోటింగ్, ప్రొటెక్టివ్ క్యాప్ కిట్, మ్యాట్టె టెక్ గ్రే అండ్ టింటెడ్ రేర్ విండోస్ జత చేశారు.
క్యాబిన్ ఎయిర్ క్లీనర్, యాప్ రిమోట్ సర్వీస్, పిక్సెల్ లైట్స్, హర్మాన్ కార్డాన్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్లు.. 60:40 ఫోల్డబుల్ రేర్ సీట్స్, 12-అంగుళాల ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ డాష్ బోర్డ్, 9-అంగుళాల సెంటర్ డిస్ ప్లే, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ ప్లే స్టోర్ వంటి బిల్ట్ ఇన్ గూగుల్ యాప్స్ ఉంటాయి.
2022 యూరో ఎన్-క్యాప్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగి ఉంటుంది. 360 డిగ్రీల పార్కింగ్ వ్యూ, రివర్స్ పార్కింగ్ అసిస్టెంట్, బ్లైండ్ స్పాట్ ఇన్ఫర్మేసన్ సిస్టమ్ (బీఎల్ఐఎస్), క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, లేన్ కీపింగ్ అసిస్ట్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ వ్యవస్థ వంటి సేఫ్టీ ఫీచర్లు జత చేశారు. ఎనిమిది కలర్స్ ఆప్షన్లలో వోల్వో సీ40 రీచార్జీ కారు వస్తుంది. బ్లాక్ స్టోన్, ఫ్యూషన్ రెడ్, థండర్ గ్రే, ఫోర్డ్ బ్లూ, సిల్వర్ డౌన్, క్రిస్టల్ వైట్, సాగే గ్రీన్, ఒనిక్స్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ కారు వస్తుంది.