బెర్లిన్, జూన్ 26 : బహుళజాతి ఆటో రంగ దిగ్గజం, జర్మనీకి చెందిన సంస్థ ఫోక్స్‌వ్యాగన్.. భారీగా ఉద్యోగులను తొలగించనున్నది. జర్మనీ ప్లాంట్లలో నాల్గింటిని మూసేయాలని సంస్థ యోచిస్తున్నది. ఈ క్రమంలోనే మొత్తంగా లక్ష మంది ఉద్యోగాలను కోల్పోవచ్చని శుక్రవారం సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ సూపర్వైజరీ బోర్డు సభ్యులు ఇందుకు సంబంధించిన ప్రణాళికల్ని వేసినట్టు తెలుస్తుండగా.. గ్రూప్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ ఒలీవర్ బ్లమ్ ఆయా అనుబంధ సంస్థల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు గత వారమే ఉద్యోగుల తొలగింపునకు అమలుపర్చే ప్లాన్లను వివరించినట్టు తెలియవస్తున్నది. జూలై 9న జరిగే సమావేశంలో దీనిపై చర్చించనున్నట్టు సమాచారం.
అయితే ఈ ఉద్యోగ కోతలపట్ల కార్మిక సంఘాలతోపాటు, కంపెనీలో పెద్ద ఎత్తున వాటా ఉన్న లోయర్ సాక్సోనీ రాష్ట్ర ప్రభుత్వ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలున్నాయని చెప్తున్నారు. మరోవైపు కంపెనీ వర్గాలు ఈ విషయంపై మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. కాగా, హానోవర్, జ్వికావు, ఎమ్డెన్ ప్లాంట్లను మూసేయాలని చూస్తున్న ఫోక్స్‌వేగన్.. తమ అనుబంధ లగ్జరీ కార్ల బ్రాండ్ ఆడీకి చెందిన నెకర్సమ్ సైట్ కార్యకలాపాలనూ ఆపేయాలని భావిస్తున్నది. ఈ ప్లాంట్లలో 45,000కుపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీంతో వీరందరి కొలువులు ప్రమాదంలో పడ్డాయి. ఇక 2024 చివర్లో కార్మిక సంఘాలతో కుదిరిన ఒప్పందం మేరకు అన్నిచోట్ల మరో 50,000 ఉద్యోగులను సంస్థ తీసేయనున్నది. ఫలితంగా మొత్తం లక్ష మంది ఉద్యోగులు రోడ్డునపడనున్నారు.
చైనాకు చెందిన ప్రత్యర్థి సంస్థల నుంచి ఫోక్స్‌వ్యాగన్‌కు గట్టి పోటీ ఎదురవుతున్నది. గతకొంత కాలంగా యూరోపియన్ దేశాల్లో డ్రాగన్ కంపెనీలైన బీవైడీ, చెరీ, లీప్‌మోటర్ వాహనాలకు గిరాకీ పెరిగిపోతున్నది. ఏడాది క్రితంతో పోల్చితే ఆయా సంస్థల మార్కెట్ వాటా రెట్టింపు కావడం ఇందుకు నిదర్శనం. మరికొన్ని చైనీస్ ఆటో కంపెనీలూ యూరప్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ పరిస్థితి ఫోక్స్‌వ్యాగన్ వ్యాపారావకాశాలను రిస్క్‌లో పడేస్తున్నది. చైనా ఆటోమేకర్లతో పోటీకితోడు విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) తయారీకి పెద్దపీట వేయడం, పెరుగుతున్న ఉత్పాదక వ్యయాలు ఫోక్స్‌వ్యాగన్‌కు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇక సొంత దేశంతోపాటు అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న చైనాలోనూ కంపెనీకి కష్టాలే ఎదురవుతున్నాయి. చైనాలో ఫోక్స్‌వ్యాగన్ సహా ఇతర విదేశీ ఆటో రంగ సంస్థల మార్కెట్ 2020తో పోల్చితే 2025లో 57 శాతం నుంచి 32 శాతానికి పడిపోయింది. బీవైడీ దెబ్బకు 2024లో రెండో స్థానానికి, 2025లో మూడో స్థానానికి ఫోక్స్‌వ్యాగన్ అమ్మకాలు దిగజారాయి. డ్రాగన్ కంట్రీలో బీఎండబ్ల్యూకూ ఎదురుగాలే వీస్తున్నది. కంపెనీ లాభం క్షీణించడానికి చైనాలో తగ్గిన అమ్మకాలే కారణమని గత వారం బీఎండబ్ల్యూ ప్రకటించడాన్నిబట్టి ఆటో రంగంలో చైనా పాత్ర ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ప్రపంచ ఆటో రంగ సంస్థల్లో రెండో స్థానంలో ఉన్న ఫోక్స్‌వ్యాగన్.. భవిష్యత్తు పెట్టుబడులపైనా పునరాలోచనలో పడుతున్నది. రాబోయే ఐదేండ్లలో దాదాపు 15 శాతం పెట్టుబడులను తగ్గించుకోవాలన్న నిర్ణయానికి కూడా వచ్చినట్టు తెలిసింది.
ప్లాంట్ల మూసివేత, పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతల వార్తలతో ఫోక్స్‌వ్యాగన్ షేర్లు శుక్రవారం ఉదయం భారీ నష్టాలకు లోనయ్యాయి. కంపెనీ వ్యాపారావకాశాలపై మదుపర్లలో భయాందోళనలు చెలరేగి అమ్మకాలకు తెగబడ్డారు. ఇక జర్మనీ ప్రధాన కేంద్రంగా 89 ఏండ్ల క్రితం మొదలైంది ఫోక్స్‌వ్యాగన్ సంస్థ. ఫోక్స్వ్యాగన్తోపాటు స్కోడా, ఆడీ, బెంట్లీ, పోర్షే, లాంబోర్ఘిని, డుకాటీ తదితర బ్రాండ్లన్నీ ఫోక్స్‌వ్యాగన్ గ్రూపునకు చెందినవేనన్న విషయం తెలిసిందే. గత ఏడాది ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 6,67,164 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో 43 శాతం మంది జర్మనీలోనే ఉన్నారు. కాగా, కంపెనీ ప్రస్తుత ఆలోచనలు కార్యరూపం దాల్చితే ప్రతి ఆరుగురిలో ఒకరు ఉద్యోగం కోల్పోనున్నారు.