న్యూఢిల్లీ, మే 19: సుప్రీం కోర్టులో టెలికాం సంస్థలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిలను రద్దు చేయాలని వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్, టాటా టెలీసర్వీసెస్ దాఖలు చేసిన పిటిషన్లను సోమవారం అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. జేబీ పర్డివాలా, ఆర్ మహదేవన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం.. టెల్కోల అభ్యర్థనలను తోసిపుచ్చుతూ అదంతా ఏమీ కుదరదని తేల్చిచెప్పింది. ఈ క్రమంలోనే ఈ పిటిషన్లను భారీ తప్పిదంగా అభివర్ణిస్తూ ఒకింత ఘాటుగా టెలికాం కంపెనీలను న్యాయమూర్తులు మందలించడం గమనార్హం.
‘ఇలాంటి పిటిషన్లు మా ముందుకు రావడంపై మేము నిజంగా దిగ్భ్రాంతికి గురయ్యాం. ఈ అభ్యర్థనలు మమ్మల్ని ఎంతో అసౌకర్యానికి లోనుచేశాయి. ముఖ్యంగా ఓ బహుళజాతి సంస్థ (వొడాఫోన్) నుంచి ఈ తరహా పిటిషన్ వస్తుందని మేము అస్సలు ఊహించలేదు. దీన్ని మేము కొట్టివేస్తున్నాం’ అంటూ వొడాఫోన్ తరఫున ఈ కేసులో వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తగీతో సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేగాక ఈ అంశంలో టెలికాం సంస్థలకు సహాయం చేసేలా ప్రభుత్వానికి ఏ రకంగా అడ్డు రాబోమని కూడా స్పష్టం చేసింది. నిజానికి జూలైదాకా ఈ కేసును వాయిదా వేయాలని రోహ్తగీ విచారణ సందర్భంగా కోర్టును కోరారు.
అయితే అందుకు కారణాన్ని కోర్టు చెప్పాలనడంతో.. ఈ సమస్యకు పరిష్కారం కోసం కోర్టు వెలుపల ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ, వొడాఫోన్ ఐడియాలో దాదాపు 50 శాతం భారత ప్రభుత్వానికి వాటా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. దీంతో ‘ఒకవేళ ప్రభుత్వం మీకు సాయం చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అందుకు మేము అడ్డురాము. కాబట్టి ఇక ఈ కేసులో వాయిదాలకు తావులేదు’ అంటూ అన్ని పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. చివరకు పిటిషన్ ఉపసంహరణకూ అంగీకరించలేదు. కాగా, 2021 జూలైలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఈ విషయంలో సాయానికి కేంద్ర ప్రభుత్వానికి వీల్లేకుండాపోతున్నదని రోహ్తగీ వాదించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఏజీఆర్ బకాయిల లెక్కింపులో లోపాలున్నాయని, వాటిని సరిచేసేందుకు అవకాశమివ్వాలని టెల్కోలు కోరగా.. 2021 జూలై 23న సుప్రీం కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే.
సుప్రీం తీర్పుతో స్టాక్ మార్కెట్లలో వొడాఫోన్ ఐడియా షేర్ విలువ తీవ్రంగా నష్టపోయింది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి టెలికాం కార్యకలాపాలను భారంగా నడుపుతున్న వొడాఫోన్ ఐడియాకు ఏజీఆర్ బకాయిల విషయంలో కూడా ఊరట లభించకపోవడంతో మదుపరులు అమ్మకాలకు దిగారు. ఈ క్రమంలోనే ఈ ఒక్కరోజే 8.41 శాతం మేర సంస్థ షేర్ విలువ దిగజారింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో రూ.6.75గా ఉన్నది. ఒకానొక దశలోనైతే 12 శాతం నష్టపోవడం గమనార్హం.
ఎయిర్టెల్ షేర్ విలువ కూడా స్వల్పంగా 0.14 శాతం లాభానికే పరిమితమైంది. కాగా, ప్రభుత్వం తమకు సాయం చేయకపోతే ఇక ఎంతోకాలం టెలికాం సేవలను నడుపలేమని ఇటీవలే వొడాఫోన్ ఐడియా హెచ్చరించిన విషయం తెలిసిందే. పైగా తమ కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్నదని, ఒకవేళ తాము దివాలా తీస్తే.. సదరు వాటా విలువ సున్నాగా మారిపోతుందని స్పష్టం చేసింది. అంతేగాక ఇప్పటికే ఈక్విటీలోకి మారిన రూ.1.18 లక్షల కోట్ల స్పెక్ట్రమ్ బకాయిలు వసూలుకావన్నది. కాబట్టి తమకు సాయం చేయాల్సిందేనని ఒక రకంగా మోదీ సర్కారును వొడాఫోన్ ఐడియా హెచ్చరించడం గమనార్హం.
వొడాఫోన్ ఏజీఆర్ బకాయిలు దాదాపు రూ.30,000 కోట్లుగా ఉన్నాయి. వీటిలో వడ్డీ, జరిమానా, వడ్డీపై జరిమానా వంటివి ఉన్నాయి. ఇక ప్రస్తుతం సుప్రీంలో వేసిన పిటిషన్ గతంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కాదు. ఈ బకాయిల రద్దు కోసం మాత్రమే. అయితే బకాయిలు చెల్లించడానికి సంబంధించిన వాయిదాల కాలానికి సైతం వడ్డీ చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం పట్టుబట్టకుండా చొరవ తీసుకోవాలని సుప్రీంను ఈ పిటిషన్లో వొడాఫోన్ కోరింది. కానీ ఇవేవీ నెరవేరలేదు. ఇక దేశంలో ఉన్న మూడు ప్రైవేట్ రంగ టెలికాం సంస్థల్లో వొడాఫోన్ ఐడియా కూడా ఒకటి. మొత్తం మార్కెట్లో 18 శాతం వాటా దీనిదే. మరోవైపు భారతీ ఎయిర్టెల్ అనుబంధ సంస్థ భారతీ హెక్సా.. వడ్డీ, జరిమానాలకు సంబంధించి రూ.34,745 కోట్లను రద్దు చేయాలని సుప్రీంను తమ పిటిషన్లో అభ్యర్థించింది.
2020 సెప్టెంబర్ 1న ఏజీఆర్ బకాయిలకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు యావత్తు భారతీయ టెలికాం రంగాన్నే ఆర్థికంగా కుదిపేసిందని కూడా పేర్కొన్నది. అయినప్పటికీ కోర్టు తీర్పును సవాల్ చేయలేదని గుర్తుచేస్తూ.. వడ్డీలు, జరిమానాల నుంచి ఊరట కల్పించాలని మాత్రమే కోరుతున్నట్టు వివరించింది. అయినా ఫలితం లేకపోయింది. టెలికాం శాఖకు చెల్లించాల్సిన మొత్తం రూ.93,520 కోట్ల ఏజీఆర్ బకాయిల్లో 10 శాతం 2021 మార్చి 31కల్లా టెలికాం సంస్థలు చెల్లించాలని, 2031 మార్చి 31లోగా ఆ మిగతా 90 శాతం బకాయిలను వార్షిక వాయిదాలుగా చెల్లించాలని 2020 సెప్టెంబర్‌లో సుప్రీం తీర్పునిచ్చిన సంగతి విదితమే.