Vodafone Idea | దేశీయ టెలికం రంగంలో మూడో అతిపెద్ద ప్రైవేట్ ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా.. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిపోయింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్పెక్ట్రం బకాయిలు, ఆ బకాయిలపై వడ్డీరేట్లను ప్రభుత్వ ఈక్విటీలుగా మారుస్తూ కంపెనీ చేసిన ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వొడాఫోన్ ఐడియా పేర్కొంది. తాజా నిర్ణయం వొడాఫోన్ ఐడియా వాటాదారులపై తీవ్ర ప్రభావం చూపనున్నదని తెలుస్తున్నది.
వొడాఫోన్ ఐడియా బోర్డు నిర్ణయంతో ఆ సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 35.8 శాతం వాటా దక్కనున్నది. ప్రమోటర్లుగా ఉన్న వొడాఫోన్ గ్రూప్‌కు 28.5 శాతం, ఆదిత్య బిర్లా గ్రూప్‌కు 17.8 శాతం వాటాలు ఉన్నాయి. వొడాఫోన్ ఐడియా అంచనా ప్రకారం స్పెక్ట్రం బకాయిలపై వడ్డీ సుమారు రూ.16 వేల కోట్లు (2.16 బిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా.
బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్, భారత్‌కు చెందిన ఐడియా గ్రూప్ ఉమ్మడి సంస్థే వొడాఫోన్ ఐడియా. వొడాఫోన్ ఐడియా తన బకాయిల్లో రూ.7,854 కోట్లు చెల్లించగా, ఇంకా సుమారు రూ.50 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. స్పెక్ట్రం ఫీజు బకాయిలపై వడ్డీని ప్రభుత్వ ఈక్విటీలుగా మారుస్తూ వొడాఫోన్ ఐడియా నిర్ణయం తీసుకున్న తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో ఆ సంస్థ స్క్రిప్ట్‌లు భారీగా దెబ్బతిన్నాయి. మధ్యాహ్నం 12.05 గంటల సమయంలో సుమారు 19 శాతం పతనం అయ్యాయి.
జియో వచ్చిన తర్వాత కస్టమర్లను భారీగా కోల్పోతుండటంతోపాటు అంతగా లాభాలు వచ్చే పరిస్థితులు లేవని వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను సర్కార్ ఈక్విటీలుగా మార్చక తప్పలేదని తెలిపింది. వొడాఫోన్ ఐడియా బోర్డు నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించాల్సి ఉంది. ఒక్కో షేర్‌ను రూ.10లకు ప్రభుత్వానికి కేటాయిస్తుందని సమాచారం.
ఆరేండ్ల క్రితం ముకేశ్ అంబానీ సారధ్యంలో జియో రంగ ప్రవేశం చేయడంతో టెలికం రంగం కకావికలమైంది. అప్పటివరకు టెలికం రంగంలో ఉన్న సంస్థలు మార్కెట్ నుంచి తప్పుకున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి టెలికం సంస్థలు భారీగా బకాయిలు పడ్డాయి. స్పెక్ట్రం కేటాయింపులు, ఏజీఆర్ బకాయిలతో టెలికం రంగం కుదేలైంది. స్పెక్ట్రం సంబంధ చెల్లింపులపై వడ్డీరేట్లను ఈక్విటీలుగా మార్చాలని తొలుత ఎయిర్టెల్ నిర్ణయించినా.. తర్వాత కేంద్రం ప్రోత్సాహకాలు అందించడంతో వెనకడుగు వేసింది.
గతేడాది సెప్టెంబర్ నాటికి వొడాఫోన్ ఐడియాకు రూ.1.95 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని సమాచారం. ఇందులో స్పెక్ట్రం కేటాయింపులకు సంబంధించి రూ.1.09 లక్షల కోట్లు.. ఏజీఆర్ బకాయిలుగా రూ.63,400 కోట్లు కేంద్రానికి చెల్లించాల్సి ఉంటుంది. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రూ.22,770 కోట్ల రుణ బకాయిలు పడింది వొడాఫోన్ ఐడియా.