Supreme Court | ప్రముఖ టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (AGR) బకాయిలను మాఫీ చేయాలని కోరుతూ వొడాఫోన్, ఎయిర్టెల్, టాటా టెలిసర్వీసెస్ దాఖలు చేసిన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తోసిపుచ్చింది. జస్టిస్ జేబీ పార్దివాలా, ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం పిటిషన్లపై విచారణ సందర్భంగా మాట్లాడుతూ తమ మందుకు వచ్చిన ఈ పిటిషన్లను చూసి నిజంగానే షాక్ అయ్యామన్నారు. మల్టినేషనల్ కంపెనీ నుంచి కంపెనీని నుంచి ఇది ఊహించలేదని.. పిటిషన్ను కొట్టివేస్తామంటూ వొడాఫోన్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గికి ధర్మాసనం తెలిపింది. కేంద్రం నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది.
వొడాఫోన్ తన ఏజీఆర్ బకాయిల వడ్డీ, జరిమానా, జరిమానాపై వడ్డీగా సుమారు రూ.30వేలకోట్లను మాఫీ చేయాలని కోరింది. టెలికాం రంగంలో పోటీని కొనసాగించేందుకు సంస్థ మనుగడ ముఖ్యమని రోహత్గి గతంలో తెలిపారు. ఇటీవల బకాయి ఉన్న వడ్డీని ఈక్విటీ మార్పిడి తర్వాత కేంద్రం ఇప్పుడు కంపెనీలో 49 శాతం వాటాను కలిగి ఉందని తెలిపారు. ప్రస్తుత రిట్ పిటిషన్ తీర్పును సమీక్షించాలని కోరడం లేదని.. కానీ తీర్పు ప్రకారం వడ్డీ, జరిమానా, జరిమానాపై వడ్డీ చెల్లింపు నుంచి మినహాయింపులు కోరుతున్నట్లు కంపెనీ పిటిషన్లో పేర్కొంది. ఏజీఆర్ బకాయిలపై వడ్డీ, జరిమానా, జరిమానాపై వడ్డీని చెల్లించాలని పట్టుబట్టకుండా తగిన దిశా నిర్దేశం చేయాలని కోరారు. అలాగే, భారతీ ఎయిర్టెల్ సైతం రాయితీలను కోరుతూ అప్పీల్ చేసుకుంది. అనుబంధ సంస్థ భారతీ హెక్సాకామ్తో కలిసి రూ.34,745 కోట్ల విలువైన వడ్డీ, జరిమానాల మినహాయింపులను కోరింది.
అయితే, 2020 సెప్టెంబర్ 1 నాటి ఏజీఆర్ తీర్పును తాము వ్యతిరేకించడం లేదని, జరిమానాలు, పేరుకుపోయిన వడ్డీ తదితర అదనపు భారం నుంచి మాత్రమే ఉపశమనం కోరుతున్నట్లు కంపెనీ పేర్కొంది. వోడాఫోన్ సైతం తాము దివాలా అంచున ఉన్నామని.. కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందకపోతే 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొనసాగించలేమని తెలిపింది. రూ.26వేల కోట్ల ఈక్విటీ ఇన్ఫ్యూషన్, ప్రభుత్వం బకాయిలను ఈక్విటీగా మార్చినప్పటికీ బ్యాంకు నిధులను పొందడంలో ఇబ్బందులున్నాయని.. ప్రభుత్వ జోక్యం లేకుండా, నిధులను సేకరించలేమని, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎదుట దివాలా ప్రక్రియను ప్రారంభించాల్సి రావచ్చని కంపెనీ పేర్కొంది. దివాలా కారణంగా కంపెనీలోని కేంద్ర ప్రభుత్వం 49శాతం వాటా నిరుపయోగమవుతుందని.. ఇప్పటికే ఈక్విటీగా మార్చిన స్పెక్ట్రమ్ బకాయిలు రూ.1.18 లక్షల కోట్లు వృధా అవుతాయని వొడాఫోన్ ఐడియా పేర్కొంది.