న్యూఢిల్లీ, జూలై 27:అంతర్జాతీయ ప్రయాణికులకు శుభవార్తను అందించింది విస్తారా ఎయిర్‌లైన్స్. టాటా-సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ విమానయాన సంస్థ.. అంతర్జాతీయ ప్రయాణికులకోసం 20 నిమిషాలపాటు వై-ఫైను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. ఆకాశంలో ప్రయాణించే సమయంలో ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న తొలి దేశీయ విమానయాన సంస్థ విస్తారా కావడం విశేషం. ఆ తర్వాత కూడా ఈ ఇంటర్నెట్ సేవలు పొందాలంటే వీరికోసం సరికొత్త ప్లాన్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశీయ క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా చెల్లించి ఈ ప్లాన్లను పొందవచ్చునని పేర్కొంది.
సేవలు కేవలం బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్, ఎయిర్‌బస్ ఏ321 నియో విమానాల్లో మాత్రమే లభించనున్నాయి. వై-ఫైకి సంబంధించిన వన్‌టైం పాస్వర్డ్ ఈ-మెయిల్ ద్వారా ప్రయాణికులకు చేరవేయనున్నట్లు, ఈ వై-ఫై సేవలు మరికొంత కాలం పొందాలంటే ప్లాన్లను కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. విమాన ప్రయాణం మరింత సుఖవంతంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ చీఫ్ కమర్షియల్ అధికారి దీపక్ రజావత్ తెలిపారు.