న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: వియత్నాంనకు చెందిన ఈవీ కార్ల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్..దేశీయ మార్కెట్లో పట్టుబిగించడానికి సిద్ధమైంది. ఇప్పటికే పలు వాహనాలను విడుదల చేసిన సంస్థ..తాజాగా మరో రెండు మాడళ్లను పరిచయం చేసింది. వీటిలో మేడ్-ఇన్ ఇండియా ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు వీఎఫ్6, వీఎఫ్7 మాడళ్లు ఉండటం విశేషం. వీటిలో 59.6 కిలోవాట్ల బ్యాటరీతో తయారు చేసిన వీఎఫ్6 మాడల్ సింగిల్ చార్జింగ్‌తో 468 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.
కేవలం 25 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 70 శాతం వరకు బ్యాటరీ రీచార్చి కానున్న ఈ కారు దేశీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని తయారు చేసింది. 12.9 ఇంచుల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఆటోమేటిక్ ఏసీ, 8.9 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారులో ఎనిమిది స్పీకర్ ఆడియో సిస్టమ్, ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. అలాగే 59.6 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన వీఎఫ్7 మాడల్ సింగిల్ చార్జింగ్‌తో 438 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. కేవలం 28 నిమిషాల్లో 10 శాతం నుంచి 70 శాతం వరకు బ్యాటరీ రీచార్జికానున్న ఈ మాడల్ 9.5 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది.