ముంబై, డిసెంబర్ 24: ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణంలో అరస్టైన బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్లను ఈ నెల 26 వరకు సీబీఐ కస్టడికి అప్పగించింది ప్రత్యేక కోర్టు. మోసం, రుణాల మంజూరులో అవకతవకలకు పాల్పడినందుకుగాను శుక్రవారం వీరిద్దరిని కస్టడిలోకి తీసుకున్న విషయం తెలిసిందే. వీడియోకాన్ గ్రూపునకు సంబంధించిన కంపెనీలకు రుణాల జారీలో అవకతవకలకు పాల్పడినట్లు సీబీఐ గుర్తించింది.
ఈ రుణాల జారీపై శుక్రవారం మరోసారి ప్రశ్నించిన సీబీఐ..అనంతరం అదుపులోకి తీసుకున్నది. విచారణలో ఆమె సహకరించకపోకపోవడంతోనే అరెస్ట్ చేసినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో చందా కొచ్చర్తో ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూపు అధినేత వేణుగోపాల్ ధూత్లతోపాటు న్యూపవర్ రెన్యూవబుల్, సుప్రీం ఎనర్జీలపై ఐపీసీ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ను దాఖలు చేసింది. ఆర్థిక సామర్థ్యం లేని ధూత్‌కు చెందిన పలు సంస్థలకు రూ.3,250 కోట్ల రుణాల మంజూరు చేసినట్లు సీబీఐ ఆరోపిస్తున్నది.