Second Hand Smart Phones | గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సెకండ్ హ్యాండ్ ఫోన్లకు గిరాకీ ఎక్కువైంది. ఈ ఏడాది సుమారు 3.5 నుంచి 4.5 కోట్ల సెకండ్ హ్యాండ్ ఫోన్లు అమ్ముడవుతాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అధ్యయనంతో తేలింది. 2022తో పోలిస్తే 15 శాతం ఎక్కువ. గతేడాది 15.1 కోట్ల కొత్త ఫోన్లు విక్రయిస్తే, ఈ ఏడాది ఐదు శాతం తగ్గుతాయని ఆ అధ్యయనం వెల్లడించింది.
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కొత్త స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు మూడు శాతం తగ్గాయి. గత మార్చి త్రైమాసికంలో తగ్గిన 19 శాతం ఎగుమతులతో పోలిస్తే.. జూన్ త్రైమాసికంలో పరిస్థితి మెరుగు పడిందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ పేర్కొంది.
ఇంతకుముందుతో పోలిస్తే స్మార్ట్ ఫోన్లు అందుబాటు ధరలో లభిస్తుండటంతో వాటికి గిరాకీ పెరిగింది. కొందరు ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ ఫోన్లకు, ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ల నుంచి అప్ గ్రేడ్ కావడానికి ప్రాధాన్యం ఇస్తుండటంతో సేల్స్ పెరుగుతున్నాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ కో-ఫౌండర్ నీల్ షా తెలిపారు.
5జీ సేవలు అందుబాటులోకి వచ్చాక చాలా మంది కొత్త ఫోన్లకు అప్ గ్రేడ్ అవుతున్నారు. మూడేండ్ల పాటు వినియోగించిన సెకండ్ హ్యాండ్ ఫోన్లకు గిరాకీ లభిస్తున్నదని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదించింది. తక్కువ ధరకే అధిక ఫీచర్లు గల స్మార్ట్ ఫోన్లు లభిస్తుండటంతో ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ల వాడకం దారులు వాటిని కొనుగోలు చేస్తున్నారు. భారత్లో 80 కోట్ల ఫోన్లు పని చేస్తుంటే వాటిలో 25 శాతం ఫీచర్ ఫోన్లేనని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ పేర్కొన్నది.