GST on Auto booking | మీరు మీ ప్రయాణానికి ఈ-కామర్స్ వెబ్సైట్లలో ఆటో రిక్షాను బుక్ చేసుకున్నారా..అయితే, ఇకపై 5 శాతం జీఎస్టీ చెల్లించాలి. ఈ నిబంధన వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ రెవెన్యూ విభాగం ఈ నెల 18న ఓ నోటిఫికేషన్ జారీచేసింది. ఇప్పటి వరకు ఈ-కామర్స్ వేదికల ద్వారా ఆటో బుకింగ్‌లపై ఉన్న జీఎస్టీ మినహాయింపును ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది
అదే సమయంలో ఆఫ్‌లైన్, మాన్యువల్ ఆటో డ్రైవర్ల సేవలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ఉబెర్, ఓలా క్యాబ్స్ ఆటోలు ఈ-కామర్స్ పరిధిలోకే వస్తాయి. ఇప్పటి వరకు వీటి ద్వారా చేసే ఆటో రిక్షా బుకింగ్‌కు జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంది. తాజా ప్రభుత్వ నిర్ణయంతో ఆన్లైన్లో ఆటో బుక్ చేసుకునే వారికి పన్ను భారం పడనుంది.