అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు భారత ఆర్థిక వృద్ధికి ప్రతిబంధకాలుగా మారుతున్నాయి.
ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ అంచనాలకు ఏడీబీ, ఇండియా రేటింగ్స్ కోతలు పెట్టాయి.
6.3-6.5 శాతం మధ్యే ఉండొచ్చని ఏడీబీ.. కాదుకాదు 6.3 శాతం దాటదని ఇండియా రేటింగ్స్ పోటాపోటీగా ప్రకటించాయి. మునుపు ఇవే 6.7%, 6.6 శాతంగా అంచనా వేయడం గమనార్హం.
న్యూఢిల్లీ, జూలై 23: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) దేశ ఆర్థిక ప్రగతి లక్ష్యాల సాధన అనుకున్నంత ఈజీ కాదని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీల తాజా లెక్కలు చెప్తున్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2023-24)తో పోల్చితే గత ఆర్థిక సంవత్సరం (2024-25) భారీగా పడిపోయిన జీడీపీ గణాంకాల్ని.. ఈ ఆర్థిక సంవత్సరం ఎలాగైనా పెంచాలని కేంద్రంలోని మోదీ సర్కారు పట్టుదలతో ఉన్నది. అయితే పోయినసారి మాదిరే ఈసారీ జీడీపీ గణాంకాలుంటాయని, లేకపోతే ఇంకా తగ్గుతాయని, అంతేగానీ పెరగబోవన్న అంచనాలు ఇప్పుడు మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి.
ఆర్థిక వ్యవస్థ బాగు కోసమైనా.. ప్రపంచ మార్కెట్లో తమ ప్రత్యర్థుల దూకుడుకు కళ్లెం వేయడానికైనా.. తమ ఆధిపత్యాన్ని అంగీకరించకపోయినా.. ఇలా దేనికైనా ప్రతీకార సుంకాలనే ఎక్కుపెడుతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ టారిఫ్‌ల సెగ రకరకాలుగా భారత్‌కూ తగులుతున్నది. ఈ క్రమంలోనే ఈ ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ అంచనాలకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ), ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ బుధవారం కోత పెట్టాయి. వచ్చే ఏడాది మార్చి ఆఖరుతో ముగిసే ఆర్థిక సంవత్సరం భారత ఆర్థిక వృద్ధిరేటు 6.3 శాతం నుంచి 6.5 శాతం మధ్యే ఉంటుందని ఏడీబీ అభిప్రాయపడింది.
ఇక ఇండియా రేటింగ్స్ 6.3 శాతం దాటకపోవచ్చన్నది. పైగా గతంతో పోల్చితే ఈ అంచనాలు 30-40 బేసిస్ పాయింట్లు తగ్గిపోవడం గమనార్హం. మునుపు ఏడీబీ అంచనా 6.7 శాతంగా, ఇండియా రేటింగ్స్ది 6.6 శాతంగా ఉన్నాయి మరి. అమెరికా టారిఫ్‌లతో అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చిత వాతావరణం నెలకొన్నదని, దీనివల్ల భారతీయ ఎగుమతులు, దేశంలోకి వచ్చే పెట్టుబడులు ప్రభావితమయ్యే అవకాశాలున్నాయని ఏడీబీ, ఇండియా రేటింగ్స్ చెప్తున్నాయి. అందుకే దేశ జీడీపీ అంచనాలను తగ్గించినట్టు స్పష్టం చేశా యి. అమెరికాకు వెళ్లే ఎగుమతులపై సుంకా లు పడితే.. వ్యాపార, పారిశ్రామిక రంగాలు ప్రభావితమవుతాయని పేర్కొన్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రకటించడానికి ముందు తీసుకొచ్చిన ఆర్థిక సర్వేలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ 6.3 శాతం నుంచి 6.8 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. అయితే ప్రస్తుత పరిస్థితులనుబట్టి ఈ స్థాయిలో కూడా దేశ ఆర్థిక వృద్ధిరేటు ఉండకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడీబీ, ఇండియా రేటింగ్స్ అంచనాలే ఇందుకు నిదర్శనం. ఆర్థిక సంవత్సరం మొదలై 4 నెలలు కూడా కాకపోవడంతో.. జాతీయ, అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా జీడీపీ అంచనాలకు మున్ముందు మరిన్ని కోతలు తప్పకపోవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టిన మోదీకి.. మొదటి రెండు పర్యాయాలతో పోల్చితే ప్రజా విశ్వాసం పెద్ద ఎత్తునే తగ్గిపోయిన సంగతి విదితమే. మెజారిటీ లేక ప్రాంతీయ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి రావడంతో మునుపటితో చూస్తే ఈ దఫా సంస్కరణల వేగం తగ్గిపోవచ్చన్న అభిప్రాయాలైతే వినిపిస్తున్నాయి. కానీ ఇదే జరిగితే దేశ జీడీపీ మరింత దిగజారవచ్చని, తద్వారా రుణ పరపతిపైనా ప్రభావం పడవచ్చన్న అంచనాలున్నాయి. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న విపత్కర పరిస్థితుల కారణంగా దేశంలో కీలకమైన తయారీ రంగం నిస్తేజంలోకి జారుకున్నది.