Byju’s-BlackRock | ఆర్థిక చిక్కుల్లో పడ్డ ప్రముఖ ఎడ్ టెక్ కంపెనీ బైజూస్’కు అమెరికా ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ కం అసెట్ మేనేజర్ ‘బ్లాక్‌రాక్’ షాక్ ఇచ్చింది. బైజూస్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కేవలం 100 కోట్ల డాలర్లు మాత్రమేనని శుక్రవారం పేర్కొంది. 2022లో ఇదే సంస్థ ఎం-క్యాప్ 2200 కోట్ల డాలర్లు అని బ్లాక్‌రాక్ అంచనా వేసింది. 2022 అంచనాతో పోలిస్తే 95 శాతం తక్కువ అని ‘టెక్ క్రంచ్’ ఓ వార్తా కథనం ప్రచురించింది. గతేడాది అక్టోబర్ చివరిలో బైజూస్ షేర్ విలువ 209.6 డాలర్లుగా బ్లాక్‌రాక్ పేర్కొంది. కానీ, 2022లో ప్రకటించిన 4660తో పోలిస్తే చాలా తక్కువ అని టెక్ క్రంచ్ నివేదిక పేర్కొంది. బైజూస్‌లో తమ వాటాల ఆధారంగా ఆ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంచనా వేసినట్లు బ్లాక్‌రాక్ వెల్లడించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గింపుపై బైజూస్ గానీ, బ్లాక్ రాక్ గానీ స్పందించేందుకు ముందుకు రాలేదు.
కొత్తగా పెట్టుబడులు సమీకరించడంతోపాటు ఆర్థిక ఫలితాల వెల్లడిలో జాప్యం, రుణ దాతలతో న్యాయ పరమైన వివాదాలు తదితర అంశాలపై బైజూస్ సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ .. ఆ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ను బ్లాక్ రాక్ కుదించడం గమనార్హం. బైజూస్‌లో బ్లాక్ రాక్ వాటా కేవలం ఒక శాతం మాత్రమే.
బైజూస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గించడం బ్లాక్‌రాక్ సంస్థకు ఇది తొలిసారి కాదు. గతేడాది బైజూస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 840 కోట్ల డాలర్లు ఉంటుందని గత మార్చి అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (యూఎస్ఎస్ఈసీ) ఫైలింగ్ లో బ్లాక్ రాక్ పేర్కొంది. 2022 డిసెంబర్ లో ఈ ఎడ్ టెక్ స్టార్టప్ ఎం-క్యాప్ 11.5 బిలియన్ డాలర్లు అని తెలిపింది.