న్యూఢిల్లీ, జూలై 13: గ్యాస్, ఆహారోత్పత్తుల ధరలు, ఇండ్ల అద్దెలు గణనీయంగా పెరగడంతో అమెరికాలో ద్రవ్యోల్బణం 41 సంవత్సరాల గరిష్ఠస్థాయికి చేరింది.2022 జూన్ నెలలో వినియోగ ధరలు నిరుడు ఇదే నెలకంటే 9.1 శాతం పెరిగినట్టు బుధవారం ప్రభుత్వం తెలిపింది. 1981 తర్వాత ఈ స్థాయిలో ద్రవ్యోల్బణం వృద్ధిచెందడం ఇదే ప్రథమం.
మే నెలలో దీని వార్షిక వృద్ధి 8.6 శాతం ఉంది. మే నెలకంటే జూన్ నెలలో ధరలు 1.3 శాతం పెరిగాయి. అలాగే ఏప్రిల్ కంటే మే నెలలో 1 శాతం పెరిగాయి. ఈ స్థాయిలో ప్రతీ నెలా ధరలు పెరుతుండటంతో అల్పాదాయ వర్గాలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయని ఆర్థిక వేత్తలు అంటున్నారు.