ముంబై, సెప్టెంబర్ 19: వడ్డీరేట్లను అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అర శాతం కోత పెట్టిన నేపథ్యంలో భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల మీద ఆ ప్రభావం ఎంతన్నదానిపై నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దేశీయ ఎక్స్పర్ట్స్ పెట్టుబడులు పెరుగుతాయంటుంటే.. మరికొందరు ఈక్విటీలపై రాబడులు తగ్గుతాయని, బంగారం ధరలు పెరుగవచ్చని అభిప్రాయపడుతున్నారు.
అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ.. బెంచ్‌మార్క్ రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 4.75-5 శాతంగా నిర్ణయించిన విషయం తెలిసిందే. మునుపు ఇది 5.25-5.50 శాతంగా ఉండేది. గాడి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు వరుసగా 14 నెలలపాటు 20 ఏండ్ల గరిష్ఠ స్థాయిలోనే కీలక వడ్డీరేటును అగ్రరాజ్య సెంట్రల్ బ్యాంక్ ఉంచింది.
‘ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల కోత ఊహించిందే. బంగారం ధరల్లో పెరుగుదలకు, ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులపై లాభాల తరుగుదలకు ఈ నిర్ణయం దారితీయవచ్చు’ అని పీహెచ్‌డీసీసీఐ అధ్యక్షుడు సంజీవ్ అగర్వాల్ అంచనా వేస్తున్నారు. అలాగే ఫెడ్ నిర్ణయంతో పెట్టుబడులన్నీ స్టాక్ మార్కెట్ల నుంచి పసిడి వైపునకు మళ్లీ ధరలు కొత్త రికార్డులకు చేరవచ్చని కామా జ్యుయెల్లరీ ఎండీ కొలీన్ షా అభిప్రాయపడ్డారు. అయితే భారత్ వంటి దేశాల్లో సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించడానికి ఫెడ్ రిజర్వ్ మార్గం సుగమం చేసిందని బిజ్2క్రెడిట్ సీఈవో రోహిత్ అరోరా అంటున్నారు. వచ్చే నెల ద్రవ్యసమీక్షలో రెపో రేటు తగ్గవచ్చని చెప్తున్నారు.