హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : అమెరికా ఇండియాను అత్యంత నమ్మకమైన మిత్రుడిగా భావిస్తున్నదని, అందుకే ఇరుదేశాల మధ్య మైత్రీ నమ్మకంతో చిరకాలంగా కొనసాగుతున్నదని అమెరికా రాయబారి సెర్జియో గోర్ చెప్పారు. అనేక అంశాల్లో భారత్‌తో అమెరికాకు సారూప్యత ఉన్నదని, ఇందుకే ఈ బంధం ఇలాగే ధృఢంగా కొనసాగుతున్నదని తెలిపారు. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చి 250 ఏండ్ల పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్‌లో మంగళవారం నిర్వహించిన ఫ్రీడమ్ 250 వేడుకల్లో ఆయన మాట్లాడారు. అమెరికాలో భారతీయులు పెట్టుబడులు పెట్టడం శుభపరిణామమని, యూఎస్ దిగుమతి చేసుకునే ఔషధాల్లో 40 శాతం ఇక్కడి నుంచే ఎగుమతి అవుతున్నాయని తెలిపారు.
ఫార్మా రంగంలో హైదరాబాద్ అగ్రగామిగా ఉన్నదని ప్రశంసించారు. హైదరాబాద్ అద్భుతమైన నగరమని కాన్సుల్ జనరల్ లారావిలియమ్స్ కీర్తించారు. ఈ ప్రాంత ప్రజలు అమితమైన ప్రేమ చూపిస్తారని, తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ఆకట్టుకుంటాయని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు అమెరికాకు మధ్య ఉన్నది దౌత్య సంబంధం మాత్రమే కాదని, ఇది ప్రజల మధ్య, కుటుంబాల మధ్య ఏర్పడిన అనుబంధమని చెప్పారు. అమెరికాతో ఉన్న ప్రత్యేక బంధానికి గుర్తుగా ఇకడి యూఎస్ కాన్సులేట్ సమీపంలోని ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని నిర్ణయించామని గుర్తుచేసిన భట్టి.. ఆ రహదారి పేరు ఫలకాన్ని అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో కలిసి ఆవిష్కరించారు.