తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న అమెరికా రాయబారి సెర్గియో గోర్
హైదరాబాద్, ఆగస్టు 25: భారత్‌కు అమెరికా రాయబారి సెర్గియో గోర్, ఆ దేశ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ ఇక్కడి చారిత్రక తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఉన్నతస్థాయి బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం, పారిశ్రామిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఈ మీటింగ్ జరిగినట్టు మంగళవారం విడుదలైన ఓ ప్రకటన పేర్కొన్నది. ఇక అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన ఈ విందు సమావేశంలో రక్షణ రంగ తయారీ, సెమీకండక్టర్స్, ఫార్మాస్యూటికల్స్, టెక్నాలజీ తదితర రంగాలకు చెందిన కంపెనీల కీలక ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దక్షిణాది రాష్ర్టాల్లో ప్రపంచ శ్రేణి వ్యాపార పెట్టుబడులకు వ్యూహాత్మక ద్వైపాక్షిక విధానంపై చర్చ జరిగింది. ‘అమెరికా, భారత్‌లు చాలా కాలం నుంచి వ్యూహాత్మకంగా కలిసి పని చేస్తున్నాయి. నేడు రక్షణ, సాంకేతికత, లైఫ్ సైన్సెస్, అంతరిక్ష రంగాల్లో బలమైన సహకారం నడుస్తున్నది. ఇది దీర్ఘకాలిక వ్యాపార భాగస్వామ్యాల పునాదిపై నిర్మితమైంది. ఈ భాగస్వామ్యాలకు మీలాంటి ఎందరో తమ డీల్స్ ద్వారా దోహదం చేశారు’ అని గోర్ అన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ర్టాలకు చెందిన వ్యాపార, పారిశ్రామికవేత్తలు ట్రస్ట్ ఇనీషియేటివ్, పాక్స్ సిలికా, యూఎస్-ఇండియా కాంపాక్ట్, యూఎస్-ఇండియా వ్యూహాత్మక మినరల్ రికవరీ ఇనీషియేటివ్‌లను సద్వినియోగం చేసుకోవాలని గోర్ పిలుపునిచ్చారు.