హైదరాబాద్, ఆగస్టు 18: చెరుకు రైతులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశంతో ఎన్ఎస్ఎల్ షుగర్స్ లిమిటెడ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది యూపీఎల్ ఎస్ఏఎస్. చెరుకు ఉత్పత్తిలో రైతులు పడే కష్టాలను టెక్నాలజీ ద్వారా తగ్గించడానికి ఇరు సంస్థలు కలిసి పనిచేయనున్నాయని ప్రకటించారు. జాయింట్ వెంచర్లో భాగం గా శాశ్వత్ మిఠాయ్ కింద 15 వేల మంది రైతులు, 30 వేల ఎకరాల స్థలంలో చెరుకు ఉత్పత్తిని పెంచడానికి, తద్వారా ఆదాయ-లాభాలు పెరిగే అవకాశం ఉన్నదని తెలిపారు.
తెలంగాణతోపాటు, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఉన్న చెరుకు రైతులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించనున్నట్లు, ఇందు కోసం ఎలాంటి చార్జీని విధించడం లేదని ఎన్ఎస్ఎల్ గ్రూపు చైర్మన్ గోవింద రాజులు చింతల తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా ఎకర భూమిలో చెరుకు ఉత్పత్తి 15 శాతం మేర పెరిగే అవకాశం ఉన్నదని, దీంతో రైతులకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు అదనంగా ఆదా యం సమకూరనున్నదని చెప్పారు.