UPI Transactions | యూపీఐ లావాదేవీల్లో 2024- డిసెంబర్ నెల చెల్లింపులు రికార్డు నమోదు చేశాయి. నెలవారీ లావాదేవీలతో పోలిస్తే ఎనిమిది శాతం పెరిగి 16.73 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. 2016 ఏప్రిల్‌లో యూపీఐ లావాదేవీలు ప్రారంభమైనప్పటి నుంచి 2024-డిసెంబర్ లావాదేవీలు అత్యధికం. 2024 నవంబర్ లో రూ.21.55 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగితే డిసెంబర్ నెలలో ఎనిమిది శాతం పెరిగి రూ.23.25 లక్షల కోట్లకు చేరాయి.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) తెలిపిన వివరాల ప్రకారం 2023తో పోలిస్తే 2024లో లావాదేవీలు 46 శాతం వృద్ధి చెందాయి. 2023లో 118 బిలియన్ల లావాదేవీలు జరిగితే 2024 డిసెంబర్లో 172 బిలియన్లకు చేరాయి. 2023లో రూ.183 లక్షల కోట్లకు చేరుకున్న యూపీఐ పేమెంట్స్ 2024లో రూ.247 లక్షల కోట్ల వద్ద స్థిర పడ్డాయి. పర్సన్ టూ మర్చంట్ (వస్తువులు లేదా సర్వీసుల కొనుగోళ్లు) లావాదేవీలు జరగడం వల్లే 2024లో లావాదేవీల సంఖ్య పెరిగింది. అక్టోబర్ నెలలో 16.58 బిలియన్ల లావాదేవీలతోపాటు రూ.23.5 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి. అంతకు ముందు సెప్టెంబర్ నెలలో 15.04 బిలియన్ల లావాదేవీలు నమోదైతే రూ.20.64 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి.
నవంబర్ నెల లావాదేవీలతో పోలిస్తే డిసెంబర్ నెలలో 510 మిలియన్ల నుంచి 540 మిలియన్ల లావాదేవీలు పెరిగాయి. నవంబర్ లో రోజూ రూ.71,840 కోట్ల యూపీఐ చెల్లింపులు జరిగితే 2024 డిసెంబర్ నెలలో రోజువారీ పేమెంట్స్ రూ.74,990 కోట్లకు చేరుకున్నది. 2023 డిసెంబర్ నెలతో పోలిస్తే 2024 డిసెంబర్లో లావాదేవీల్లో 39 శాతం వృద్ధి, లావాదేవీల చెల్లింపు విలువ 28 శాతం వృద్ధి చెందింది.
ఇమిడియెట్ పేమెంట్ సర్వీసెస్ (ఐఎంపీఎస్) లావాదేవీలు నవంబర్‌తో పోలిస్తే గత నెలలో ఎనిమిది శాతం పెరిగాయి. అక్టోబర్ నెలలో 467 మిలియన్ల లావాదేవీలు నమోదైతే, నవంబర్ లో 408 మిలియన్లు, డిసెంబర్ లో 441 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. విలువ రూపేణా అక్టోబర్ నెలలో రూ.6.29 లక్షల కోట్లు, నవంబర్ లో రూ.5.58 లక్షల కోట్లు, డిసెంబర్ నెలలో ఎనిమిది శాతం పెరిగి రూ.6.02 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. 2023 డిసెంబర్ నెలతో పోలిస్తే లావాదేవీల పరంగా 12 శాతం తగ్గితే, విలువ పరంగా ఆరు శాతం క్షీణించింది. 2024 నవంబర్ నెలతో పోలిస్తే, 2024 డిసెంబర్ నెలలో రోజువారీ లావాదేవీలు ఐదు శాతం వృద్ధి చెంది 14.23 మిలియన్లకు చేరాయి. విలువ రూపేణా 2024 నవంబర్ నెలలో రోజూ రూ.18,611 కోట్ల లావాదేవీలు జరిగితే డిసెంబర్ లో రూ.19,405 కోట్ల చెల్లింపులు జరిగాయి.
2024 నవంబర్ నెలలో 359 మిలియన్ల ఫాస్టాగ్ లావాదేవీలు జరిగితే డిసెంబర్ నెలలో 382 మిలియన్ల ట్రాన్సాక్షన్లు నమోదయ్యాయి. అంతకు ముందు అక్టోబర్ నెలలో 345 మిలియన్ల లావాదేవీలు రికార్డయ్యాయి. విలువ రూపేణా అక్టోబర్ నెలలో ఫాస్టాగ్ చెల్లింపులు రూ.6,115 కోట్లు జరిగితే, నవంబర్ నెలలో రూ.6,070 కోట్లకు చేరుకుని తిరిగి డిసెంబర్ నెలలో తొమ్మిది శాతం వృద్ధితో రూ.6,642 కోట్లకు చేరుకుంది. 2023 డిసెంబర్ పేమెంట్స్ విలువతో పోలిస్తే గత నెలలో 13 శాతం వృద్ధి చెందాయి. ఇక ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) ట్రాన్సాక్షన్లు నవంబర్ నుంచి డిసెంబర్ వరకూ ఒక శాతం పెరిగి 92 మిలియన్ల నుంచి 93 మిలియన్లకు పెరిగాయి. విలువ రూపేణా నవంబర్ నెలలో రూ.23,844 కోట్ల చెల్లింపులు జరిగితే డిసెంబర్ నెలలో రూ.24,020 కోట్లకు చేరాయి. ఇక అక్టోబర్ నెలలో 126 మిలియన్ల లావాదేవీలతో రూ.32,493 కోట్ల విలువ గల చెల్లింపులు రికార్డయ్యాయి.