న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత నెలలో 20 బిలియన్ల లావాదేవీలు జరిగినట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెల్లడించింది. విలువ పరంగా చూస్తే రూ.24.85 లక్షల కోట్లుగా నమోదైంది. జూలై నెలలో నమోదైన రూ.25.08 లక్షల కోట్ల కంటే ఇది తక్కువగా నమోదుకావడం విశేషం.
అలాగే మే నెలలో రికార్డు స్థాయి రూ.25.14 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన రూ.20.60 లక్షల కోట్ల లావాదేవీలతో పోలిస్తే మాత్రం 21 శాతం పెరిగాయి. సరాసరిగా గత నెలలో రోజుకు రూ.80,177 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయని ఎన్పీసీఐ తాజాగా వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న డిజిటల్ లావాదేవీల్లో 85 శాతం యూపీఐ ద్వారా జరుగుతుండటం విశేషం.