ముంబై, అక్టోబర్ 1 : యూపీఐ లావాదేవీలపై ఏ రకమైన చార్జీలనూ వేసే యోచన లేదని బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష అనంతరం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగానే ఓ ప్రశ్నకు పైవిధంగా బదులిచ్చారు. యూపీఐ లావాదేవీలు విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో చార్జీలు పడబోతున్నాయన్న వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మల్హోత్రా వాటిని ఖండించారు. తమ ముందుకు ఆ తరహా ప్రతిపాదనేదీ రాలేదన్నారు. ఇక ఈఎంఐల ద్వారా మొబైల్స్ కొన్నవారు ఆ కిస్తీలను సక్రమంగా చెల్లించకపోతే లోన్ ఇచ్చిన బ్యాంకులు, ఇతర రుణదాతలు సదరు ఫోన్లు పనిచేయకుండా రిమోట్ ద్వారా లాక్ చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్టు గవర్నర్ చెప్పారు.
ఊహించినట్టుగానే ఈసారి ద్రవ్యసమీక్షలోనూ కీలక వడ్డీరేట్ల జోలికి ఆర్బీఐ వెళ్లలేదు. దీంతో రెపోరేటు 5.5 శాతం వద్దే యథాతథంగా ఉన్నది. ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా జరిగిన ద్రవ్యసమీక్షల్లో పోయినసారి (ఆగస్టు) మినహా మిగతా మూడు (ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్) ద్రవ్యసమీక్షల్లో రెపోరేటును ఆర్బీఐ 100 బేసిస్ పాయింట్లు తగ్గించిన సంగతి విదితమే. కాగా, ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో అంతా వడ్డీరేట్లను ఎక్కడివక్కడే ఉంచాలని నిర్ణయించారు. దీంతో పండుగ వేళ ఈఏంఐలు దిగొస్తాయన్న రుణగ్రహీతల ఆశలు ఆవిరైపోయాయి.
బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్‌బీడీ) ఖాతాదారులు ఇక ఉచితంగానే డిజిటల్ బ్యాంకింగ్ (మొబైల్/ఇంటర్నెట్ బ్యాంకింగ్) సేవలను వినియోగించుకోవచ్చు. ఈ మేరకు ఆర్బీఐ బీఎస్‌బీడీ ఖాతాలకు అందించే సేవలను తాజాగా విస్తరించింది. ఖాతాదారులు అత్యవసర బ్యాంకింగ్ సేవలు మాత్రమే అందుకునేలా బీఎస్‌బీడీ ఖాతాలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇందులోభాగంగా బ్యాంక్ శాఖల్లో నగదు డిపాజిట్లతోపాటు, ఏటీఎం/సీడీఎంలను ఉచితంగానే వాడుకోవచ్చు. ఏటీఎంల్లో నగదు ఉపసంహరణలు సహా నెలకు కనీసం నాలుగుసార్లు ఫ్రీ విత్‌డ్రాయల్స్ సౌకర్యం ఈ ఖాతాదారులకు ఉంటుంది. ఇప్పుడు డిజిటల్ బ్యాంకింగ్ సేవలనూ ఉచితంగా పొందే అవకాశాన్ని ఆర్బీఐ ఇచ్చింది. ‘బీఎస్‌బీడీ ఖాతాదారులకు అందే ప్రయోజనాలను మినిమం బ్యాలెన్స్ చార్జీలు లేకుండా డిజిటల్ బ్యాంకింగ్ సేవలకూ వర్తింపజేయాలన్న ప్రతిపాదనను అమల్లోకి తెస్తున్నాం’ అని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.
ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడితే వడ్డీరేట్లను తగ్గించేందుకు వీలుంటుందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. నిజానికి ఈ ఏడాది 1 శాతం వడ్డీరేట్లను తగ్గించామని, అయినప్పటికీ రుణగ్రహీతలకు ఆ మేర ప్రయోజనం ఇంకా చేరలేదంటూ బ్యాంకర్ల తీరుపై ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక అమెరికా టారిఫ్‌ల ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ, ఇతర కీలక రంగాలపై ఏ స్థాయిలో ఉంటుందన్నదానిపై స్పష్టత రావట్లేదన్న ఆయన.. భారతీయ ఎగుమతులను ట్రంప్ సుంకాలు తప్పక ప్రభావితం చేస్తాయన్న అభిప్రాయాన్నే కనబర్చడం గమనార్హం. అయితే ఆర్థిక వ్యవస్థ డీలాపడితే దాన్ని అధిగమించేందుకు రాబోయే రోజుల్లో తప్పక వడ్డీరేట్ల కోతలుంటాయన్న సంకేతాలనిచ్చారు. అలాగే సాధారణానికి మించి కురుస్తున్న వర్షాలు, జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ.. దేశ వృద్ధిరేటు పెరుగుదలకు, ద్రవ్యోల్బణం తగ్గుదలకు దోహదం చేసే అంశాలని పేర్కొన్నారు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనాన్ని నిశితంగా గమనిస్తూనే ఉన్నామని, అవసరమైనప్పుడు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఆర్బీఐ నిర్ణయాలు రుణ లభ్యతను పెంచేలా ఉన్నాయి. బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ల బలోపేతానికీ దోహదం చేస్తున్నాయి. బీఎస్‌బీడీ ఖాతాదారులకూ కలిసొస్తాయి.
డిసెంబర్లో జరిగే తదుపరి ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్లను ఆర్బీఐ తగ్గిస్తుందని భావిస్తున్నాం. ఆర్బీఐ ప్రస్తుత నిర్ణయం బ్యాలెన్సింగ్‌గా ఉన్నది. దేశ జీడీపీ అంచనాలను పెంచడం ప్రోత్సాహకరం.
ఈసారి ద్రవ్యసమీక్షలో రెపోరేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గవచ్చని అంచనా వేశాం. ఏదిఏమైనా తదుపరి రెండు ద్రవ్యసమీక్షల్లో వడ్డీరేట్లు 50 బేసిస్ పాయింట్లు దిగొస్తాయని ఆశిస్తున్నాం. అప్పుడే రియల్టీకి ఊతం.
దేశంలో స్థిరాస్తి రంగాన్ని ప్రోత్సహించడానికి కేవలం జీఎస్టీ భారాన్ని తగ్గిస్తే చాలదు.. వడ్డీరేట్లకూ కోతలు పెడితేనే మార్కెట్లో కొనుగోలుదారులకు ఉత్సాహం వస్తుంది.