న్యూఢిల్లీ, జూన్ 11 : పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో చెలరేగిన అలజడికి అడ్డుకట్ట వేసేందుకు యూపీఐ పేమెంట్స్‌ను ప్రోత్సహించిన మోదీ సర్కారు.. ఇప్పుడు యూటర్న్ తీసుకుంటున్నదా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. రూ.3,000 దాటిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలపై మళ్లీ మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్)ను ప్రవేశపెట్టే యోచనను కేంద్రం పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు పాలసీ మార్పునకు పావులు కదుపుతున్నారనీ చెప్తున్నారు.
నానాటికీ పెరుగుతున్న యూపీఐ పేమెంట్స్.. బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు పని భారాన్ని పెంచేస్తున్నాయి. దీంతో బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు మౌలిక వసతులు, ఖర్చుల నిర్వహణలో ఊరట దక్కేలా రూ.3,000 దాటిన యూపీఐ లావాదేవీపై ఎండీఆర్ చార్జీలను వేయాలని చూస్తున్నారు. ఎండీఆర్ విధివిధానాలు, దాని అమలు కోసం ఇప్పటికే గత వారం ప్రధాన మంత్రి కార్యాలయం, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక సేవల విభాగాలు ఓ కీలక సమావేశాన్ని నిర్వహించాయని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. నిజానికి 2020 జనవరి నుంచి ఎండీఆర్ చార్జీలను రద్దు చేశారు. అయితే తిరిగి దాన్నిప్పుడు తీసుకురావాలన్న బ్యాం కర్లు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల ఒత్తిళ్లకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గుతున్నదని వారంటున్నారు.
యూపీఐ లావాదేవీలపై బ్యాంకులు త్వరలో ఎండీఆర్ చార్జీలను వేయబోతున్నాయంటూ వస్తున్న వార్తలు నిరాధారమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం కొట్టిపారేసింది. ఈ వదంతులను నమ్మవద్దని, తమ పరిశీలనలో అలాంటి ఆలోచనేదీ లేదని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో స్పష్టం చేసింది. కాగా, ఈ వార్తలపై అంతకుముందు కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. ‘ఈ రకమైన వసూళ్లను (పన్నులను) మీరు ఏమని పిలుస్తారు?’ అంటూ ప్రజలనుద్దేశించి ఫేస్బుక్లో పెట్టింది.