UPI New Service | నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలో యూపీఐ లైట్ యూజర్ల కోసం ఆటో టాప్ అప్ సర్వీస్‌ని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఆటో టాప్-అప్ సహాయంతో యూజర్లు తమ బ్యాంకు నుంచి యూపీఐ లైట్లో తరుచూ డబ్బులను డిపాజిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్‌గా డిపాజిట్ కానున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 31 నుంచి ఆటో టాప్-అప్ సర్వీస్ అందుబాటులోకి రానున్నది. ఈ మేరకు ఎన్పీసీఐ తాజాగా ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. కస్టమర్స్ ఎప్పుడైనా ఈ సర్వీస్‌ని ఆఫ్ చేసుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది.
చిన్న చిన్న చెల్లింపుల కోసం యూపీఐ లైట్‌ని ఎన్పీసీఐ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రూ.500 వరకు చెల్లింపుల కోసం యూపీఐ పిన్ అవసరం లేకుండా డబ్బులు పంపే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ మొత్తం ఉంటే మాత్రం యూపీఐ పిన్ని ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంది. కస్టమర్లు బ్యాంకు ఖాతా నుంచి యూపీఐ లైట్ అకౌంట్‌కి డబ్బులు జమ అయ్యేందుకు నిర్ణీత మొత్తాన్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. యూజర్ ఒకసారి టాప్-అప్‌గా రూ.1000 అమౌంట్‌ని పరిమితిగా సెట్ చేసుకున్నట్లయితే.. యూపీఐ లైట్ వాలెట్లో బ్యాలెన్స్ అయిపోయిన వెంటనే ఆటోమేటిక్‌గా రూ.1000 జమవుతాయి. ఎక్కువగా తక్కువ మొత్తాన్ని యూపీఐ ద్వారా చెల్లింపు చేసేవారికి ఎంతో సౌకర్యవంతంగా ఉండనున్నది.
యూపీఐ లైట్ వాలెట్ గరిష్ఠ పరిమితి రూ.2వేలు మాత్రమే. ఆ తర్వాత రూ.2వేలు మాత్రమే ఆటో-టాప్అప్ చేసుకునేందుకు వీలుంటుంది. ఈ సూచనలు బ్యాంకులు, కంపెనీలకు వర్తిస్తాయి. జారీ చేసే బ్యాంకులు యూపీఐ లైట్ ఆటో టాప్ అప్ సర్వీస్‌ని అందిస్తాయి. ఒక రోజులో గరిష్ఠంగా ఐదుసార్లు మాత్రమే బ్యాంక్ ఖాతా నుంచి యూపీఐ లైట్ అకౌంట్‌కి నిర్ణీత మొత్తాన్ని యాడ్ చేసుకునేందుకు వీలుంటుంది. సంబంధిత థర్డ్ పార్టీ పేమెంట్ యాప్ సర్వీస్ కంపెనీలు, బ్యాంకులు మాండేట్ సదుపాయాన్ని అందించే సమయంలో వెరిఫై చేయాల్సి ఉంటుంది.