UPI | భారత జాతీయ చెల్లింపుల సంస్థ (NPCI) డిజిటల్ చెల్లింపుల వినియోగాన్ని మరింత ప్రోత్సహించే లక్ష్యంతో యూపీఐ వ్యవస్థలో కీలక మార్పులు చేసింది. సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త నిబంధనల ప్రకారం.. నిర్దిష్ట కేటగిరీలలో ధ్రువీకరించిన వ్యాపారులకు వినియోగదారులు రోజుకు గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు చెల్లించేందుకు అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో చెల్లింపుల కోసం చెక్కులు లేదా బ్యాంక్ బదిలీలపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ, తాజా మార్పులతో యూపీఐ ద్వారానే అధిక విలువ కలిగిన లావాదేవీలు జరిపేందుకు మార్గం ఏర్పడింది. ప్రధాన ఉద్దేశం వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడం, డిజిటల్ లావాదేవీలను మరింత వేగవంతం చేయడమే ఉద్దేశం. అయితే, వ్యక్తుల మధ్య (పర్సన్ టు పర్సన్) నగదు బదిలీల పరిమితి మాత్రం యథాతథంగా ఉంది. రోజుకు రూ.1 లక్షలు చెల్లించవచ్చు.
ఇన్సూరెన్స్ : ఒక్కో లావాదేవీకి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు. రోజుకి గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు అనుమతి ఉంటుంది.
రుణాలు-ఈఎంఐ : ఒక్క లావాదేవీకి రూ.5 లక్షలు, రోజుకి రూ.10 లక్షల వరకు చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది.
ప్రయాణ రంగం : పరిమితి రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు. రోజుకి గరిష్ఠంగా రూ.10 లక్షలు.
క్రెడిట్ కార్డ్ బిల్లులు : ఒక్క లావాదేవీకి రూ.5 లక్షలు, రోజుకి రూ.6 లక్షల వరకు చెల్లింపులకు అవకాశం.
నగల కొనుగోళ్లు : లావాదేవీ పరిమితి రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంపు. రోజుకి రూ.6 లక్షల వరకు అనుమతి.
ప్రభుత్వ సేవలు : GeM పోర్టల్లో పన్నులు, డిపాజిట్ల చెల్లింపుల పరిమితి రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెరిగింది.
బ్యాంకింగ్ సేవలు : డిజిటల్ టర్మ్ డిపాజిట్లకు పరిమితి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు.
ఈ మార్పులు, వ్యాపార లావాదేవీలు మాత్రమే కాకుండా ప్రయాణాలు, బీమా, రుణ చెల్లింపులు, ఇతర ఆర్థిక కార్యకలాపాల్లో యూపీఐ మరింత ప్రభావవంతంగా మారే అవకాశం ఉందని ఎన్సీపీఐ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఎన్సీపీఐ ఆశించిన విధంగా.. ఇది దేశంలోని డిజిటల్ చెల్లింపుల విస్తరణకు నూతన దిశను చూపనుంది.