హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సు సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు గురువారం రెండు సంస్థలు ముందుకొచ్చాయి. యూపీసీ వోల్ట్ సంస్థ దశలవారీగా వచ్చే ఐదేండ్లలో రూ.5,000 కోట్లతో ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల సామర్థ్యంతో కృత్రిమ మేధస్సు (ఏఐ) అనుకూల డాటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకున్నది. నిర్మాణ దశలో సుమారు 3వేల మందికి, డాటా సెంటర్ ఏర్పాటయ్యాక మరో 800 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అలాగే ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా కంపెనీ రాష్ట్రంలోని శంషాబాద్, గాగిల్లాపూర్లోగల యూనిట్‌ను రూ.623 కోట్లతో విస్తరించనున్నట్టు ప్రకటించింది.
గోద్రేజ్ ఇండస్ట్రీస్ సీఎండీ నాదిర్ గోద్రేజ్తో రాష్ట్ర ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు సమావేశమయ్యారు. ఆయిల్ పామ్ సాగులో ఏఐ వినియోగం, రూ.150 కోట్లతో హైదరాబాద్ డెయిరీ ప్లాంట్ విస్తరణపై చర్చించారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులపైనా మాట్లాడారు.
దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో సీఎం రేవంత్ రెడ్డితో డబ్ల్యూఈఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్, సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెట్వర్క్ కో-ఆర్డినేషన్ హెడ్ మంజు జార్జ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డబ్ల్యూఈఎఫ్ ఫాలో-అప్ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించాలన్న సీఎం ప్రతిపాదనపై వారు స్పందిస్తూ.. సమీప భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
దావోస్ సదస్సులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అక్కడి సీఎం రెసిడెన్స్‌లో జరిగిన ఈ భేటీలో ఏపీ మంత్రి లోకేష్ పాల్గొన్నారు.