Car Sales | న్యూఢిల్లీ, ఆగస్టు 21: కార్లకు ఆదరణ తగ్గింది. ఆశించిన స్థాయిలో అమ్ముడుపోవడం లేదు. దేశవ్యాప్తంగా డీలర్ల వద్ద మిగిలిపోయిన ప్యాసింజర్ వెహికిల్స్ (పీవీ) సంఖ్య 7 లక్షలకు చేరింది. వీటి విలువ రూ.73,000 కోట్లుగా ఉందని ఆటోమొబైల్ డీలర్ల సంఘ సమాఖ్య (ఫాడా) తాజాగా వెల్లడించింది. గత 70-75 రోజులుగా వాహనాలు డీలర్ల వద్ద అలాగే ఉంటున్న పరిస్థితి నెలకొన్నట్టు స్పష్టం చేసింది.
డీలర్ల వద్ద పేరుకుపోతున్న వాహన నిల్వలు.. యావత్తు భారతీయ ఆటో రంగ పరిశ్రమనే సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉందని ఫాడా అధ్యక్షుడు మనీష్ రాజ్ సింఘానియా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్యాసింజర్ వెహికిల్స్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ (పీవీ ఓఈఎం)ను డీలర్ల వైఫల్యంపై దృష్టి సారించాలని కోరారు. క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. నిజానికి గత నెల జూలైలో దేశీయంగా పీవీ సేల్స్ నిరుడుతో పోల్చితే 10 శాతం పెరిగాయి. 3,20,129 యూనిట్లకు చేరాయని ఫాడానే చెప్తున్నది. అయినప్పటికీ కంపెనీల నుంచి డీలర్లకు వాహనాల సరఫరా పెరగడంతో గోడౌన్లలోనే ఉండిపోక తప్పడం లేదు. ఫలితంగా డీలర్లకు నష్టాలు మరింతగా పెరుగుతున్నాయి.
మార్కెట్లో మందగించిన అమ్మకాలను మళ్లీ పరుగులు పెట్టించేందుకు ఆయా సంస్థలు తమ కార్లపై ఆఫర్లు ప్రకటించాలని ఫాడా సూచిస్తున్నది. ధరలను తగ్గించడం, వారంటీలను పెంచడం, ఫ్రీ సర్వీస్ గడువును పెంచి ఇతర ప్రోత్సాహకాలను కొనుగోలుదారులకు ఇవ్వడం కలిసొస్తుందని డీలర్లు అభిప్రాయపడుతున్నారు. రాబోయే పండుగ సీజన్ దృష్ట్యా డిస్కౌంట్లు మార్కెట్‌ను ఉత్సాహపర్చగలవని కూడా చెప్తున్నారు. ఇక ఈ క్లిష్ట పరిస్థితుల్లో డీలర్లపై ఒత్తిడిని తగ్గించేందుకు తయారీదారులు ప్రొడక్షన్ హాలిడే తీసుకోవడం కూడా మంచిదేనన్న సలహాలు డీలర్ల నుంచి వస్తున్నాయి. కరోనా సమయంలో ఎదురైన విపత్కర పరిస్థితులను ఉత్పత్తి విరామంతోనే అటు కంపెనీలు, ఇటు డీలర్లు అధిగమించారు.
కార్ల తయారీ సంస్థలు మార్కెట్లో రిటైల్ అమ్మకాలకు తగ్గట్టుగా తమ ఉత్పత్తిని సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది. రాబోయే నెలల్లో డీలర్లకు వాహనాల సరఫరాను తగ్గిస్తేనే మంచిదన్నట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. సేల్స్ పెరిగేందుకు కంపెనీలూ కృషి చేయాలి. అప్పుడే డీలర్ల వద్ద మిగిలిపోయిన వాహనాలు త్వరత్వరగా విక్రయించడానికి వీలుంటుంది.