Mobile Customer ID | మొబైల్ సిమ్ కార్డుల హ్యాకింగ్‌తో మోసాలు జరుగుతున్నాయి. ఈ మోసాల కట్టడికి కేంద్రం కసరత్తు చేస్తున్నది. నిబంధనలను కఠినతరం చేస్తోంది. మరోవైపు మొబైల్ సిమ్ కార్డుల విక్రేతలపై కేవైసీ నిబంధనలు అమలు చేయాలని, భారీగా సిమ్ కార్డు విక్రయాలను నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది. అందుకోసం మొబైల్ ఫోన్ యూజర్లకు ఆధార్ తరహాలో సరికొత్త కస్టమర్ ఐడీ రూపంలో విశిష్ట ఐడీ నంబర్ జారీ చేయాలని భావిస్తున్నది. ఈ నంబర్ సాయంతో ప్రధాన మొబైల్ సిమ్ కార్డుతోపాటు అనుబంధ ఫోన్ కనెక్షన్లను గుర్తించడానికి వీలు చిక్కుతుందని చెబుతున్నారు.
మొబైల్ ఫోన్ యూజర్లను సైబర్ మోసాల నుంచి రక్షించడంతోపాటు నేరుగా ప్రభుత్వ పథకాలను అర్హులకు చేర్చడానికి ఈ ఐడీ ఉపయోగ పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇందుకు అవసరమైన విధి విధానాలను కేంద్ర టెలికం శాఖ సిద్ధం చేసినట్లు ఓ ఆంగ్ల దిన పత్రికలో వార్తా కథనం ప్రచురితమైంది. ఈ కస్టమర్ ఐడీ సాయంతో ఒక కస్టమర్ నిర్దిష్ట సంఖ్య కంటే ఎక్కువ సిమ్ కార్డులు పొందకుండా నివారించవచ్చునని కేంద్రం యోచన.
కస్టమర్ ఐడీ ద్వారా వాస్తవంగా సదరు సిమ్ కార్డు ఎవరు వాడుతున్నారో ప్రభుత్వం తెలుసుకోగలుగుతుందని అంటున్నారు. సిమ్ కార్డు జారీ చేస్తున్నప్పుడే ఈ వివరాలు కోరతారని భావిస్తున్నారు. డేటా ప్రొటెక్షన్ బిల్లుకు అనుగుణంగా పిల్లల మొబైల్ ఫోన్ల వినియోగంపై పేరెంట్స్ పర్మిషన్ ధ్రువీకరణకు టెలికం కంపెనీలకు వీలు చిక్కుతది. కస్టమర్ ఐడీ సాయంతో మోసపూరిత మొబైల్ కనెక్షన్లు నివారించవచ్చునని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒక వ్యక్తి గరిష్టంగా తొమ్మిది సిమ్ కార్డులు వాడొచ్చు. కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ సాయంతో వెరిఫికేషన్ నిర్వహిస్తేనే మోసాలను అరికట్టగలుగుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేషియల్ రికగ్నిషన్‌తో ఇటీవలే కేంద్రం 64 లక్షల మొబైల్ ఫోన్ల కనెక్షన్లు రద్దు చేసింది.
ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పథకం అమలు కోసం కేంద్రం.. ప్రతి ఒక్కరి ఆధార్ నంబర్‌కు 14 డిజిట్స్ ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్’ లింక్ చేస్తున్నది. దీంతో సంబంధిత వ్యక్తుల సమాచారాన్ని వైద్యులు, బీమా సంస్థలు తెలుసుకోవచ్చు. ఇదే తరహాలో మొబైల్ ఫోన్ సబ్స్క్రైబర్లకు కేటాయించాలని ప్రతిపాదిస్తున్న ‘కస్టమర్ ఐడీ’తో సిమ్ కార్డ్ ట్రాక్ చేయడంతోపాటు అది కొనుగోలు చేసిన ప్రదేశం, సిమ్ కార్డు ఓనర్ తదితర వివరాలు తెలుసుకోవచ్చు. మొబైల్ ‘కస్టమర్ ఐడీ’ ఆధారంగా అనుమానాస్పదంగా వ్యవహరించే వ్యక్తుల ఫోన్ నంబర్లన్నీ ఒకేసారి బ్లాక్ చేయొచ్చునని అధికార వర్గాలు చెబుతున్నాయి.