రెండేండ్లలో రూ. 1,000 కోట్లు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: తమ టెక్నాలజీలో వచ్చే రెండేండ్లలో రూ. 1,000 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇందులో చాలావరకూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఇన్వెస్ట్ చేస్తామని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నితేష్ రంజన్ తెలిపారు. కొత్త టెక్నాలజీ ఆర్కిటెక్చర్‌ను నిర్మించడానికి, డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటుకు పెట్టుబడులు చేస్తామన్నారు.
‘యూనియన్నెక్స్’ సూపర్‌యాప్‌ను, డిజిటల్ రెడీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ అయిన ‘యూనియన్ సంభవ్’ను బుధవారం బ్యాంక్ ఆవిష్కరించిన సందర్భంగా నితేష్ పై అంశాలు వెల్లడించారు. అలాగే బ్యాంక్ ఐదు డిజిటల్ రుణ సాధనాల్ని ప్రారంభించింది. అవి..ప్రి-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ (పీఏపీఎల్), యూనియన్ క్యాష్ (పెన్షనర్ లోన్), శిశు ముద్రా లోన్, ఎంఎస్ఎంఈ లోన్-ఆటో-రెన్యువల్, కేసీసీ లోన్-ఆటో-రెన్యువల్. తమ మొబైల్ ప్లాట్ఫామ్లో 1.65 కోట్ల మంది ఖాతాదారులున్నారని, ఈ సంవత్సరాంతంలోగా ఈ సంఖ్య 2 కోట్లు అధిగమించాలన్నది లక్ష్యమని బ్యాంక్ ఎండీ, సీఈవో రాజ్‌కిరణ్ రాయ్ చెప్పారు.