Subrata Roy | న్యూఢిల్లీ, నవంబర్ 15: సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయ్ మరణించిన నేపథ్యంలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వద్దనున్న రూ.25,000 కోట్ల సహారా నిధులు తిరిగి ఫోకస్‌లోకి వచ్చాయి. దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా 75 ఏండ్ల సుబ్రతారాయ్ మంగళవారం మృతిచెందారు. మరణించేనాటికి ఆయన గ్రూప్ సంస్థలకు సంబంధించి పలు రెగ్యులేటరీ, లీగల్ పోరాటాలు చేస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా పొంజి స్కీముల ద్వారా సహారా కంపెనీలు నిధులు సమీకరించాయన్న ఆరోపణల్ని ఎప్పటికప్పుడు సహారా గ్రూప్ ఖండిస్తున్నప్పటికీ, ఆ కేసు లు ఇంకా కొనసాగుతున్నాయి. రెండు సహారా గ్రూప్ సంస్థలు-సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ (ఎస్‌ఐఆర్‌ఈఎల్), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ (ఎస్‌హెచ్‌ఐసీఎల్)లు ఆప్షనల్లీ ఫుల్లీ కన్వర్ట్‌బుల్ బాండ్లు (ఓఎఫ్సీడీలు) ద్వారా దాదాపు 3 కోట్ల మంది ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన సొమ్మును తిరిగి చెల్లించాలంటూ 2011లో ఆ కంపెనీలను సెబీ అదేశించింది.
నియంత్రణలు, నిబంధనలను ఉల్లంఘిస్తూ నిధుల్ని సహారా కంపెనీలు సమీకరించాయన్న కారణంగా మార్కెట్ రెగ్యులేటర్ ఈ ఆదేశాలు జారీచేసింది. పలు అప్పీళ్ల అనంతరం 2012 ఆగస్టులో సుప్రీంకోర్టు సెబీ ఆదేశాల్ని సమర్థిస్తూ సహారా కంపెనీలు మదుపరుల నుంచి సమీకరించిన డబ్బును 15 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలన్నది. అలాగే ఇన్వెస్టర్లకు నిధులు రిఫండ్ చేయడానికి సెబీ వద్ద రూ.24,000 కోట్లు డిపాజిట్ చేయాలంటూ సహారా గ్రూప్‌ను సుప్రీం ఆదేశించింది. తమ 95 శాతం మంది ఇన్వెస్టర్లకు నేరుగా రిఫండ్ చేశామంటూ సహారా గ్రూ ప్ క్లెయిం చేసినా, సెబీ వద్ద సుప్రీం ఆదేశాలను అనుసరించి డిపాజిట్ చేసింది.
19 లక్షల దరఖాస్తులు
సెబీ వార్షిక నివేదిక ప్రకారం సహారా డబ్బు క్లెయించేస్తూ 2023 మార్చి 31నాటికి 53,687 ఖాతాలకు సంబంధించి 19,650 దరఖాస్తులు అందాయి. ఇందులో 48,326 ఖాతాలకు చెందిన 17,526 దరఖాస్తుదార్లకు రిఫండ్ ఇచ్చినట్టు సెబీ తెలిపింది. ఇందుకు రూ.67.98 కోట్ల వడ్డీతో సహా 138.07 కోట్లు చెల్లించామన్నది. మిగిలిన దరఖాస్తుదార్ల రికార్డులు సహారా గ్రూప్ సమర్పించిన డాటాలో లభ్యంకానందున, ఆ దరఖాస్తుల్ని క్లోజ్ చేసినట్టు సెబీ తెలిపింది. 2023 మార్చి 31నాటికి జాతీయ బ్యాంక్‌ల్లో డిపాజిట్ చేసిన మొత్తం రూ.25,163 కోట్లు ఉందని రెగ్యులేటర్ వెల్లడించింది.
128 ట్రక్కుల్లో డాక్యుమెంట్లు
ఇన్వెస్టర్లకు జారీచేసిన ఓఎఫ్‌సీడీల వివరాలు, చెల్లింపు బిల్లులు తదితరాలతో కూడిన డాక్యుమెంట్లను 128 ట్రక్కుల్లో సెబీ వద్దకు సుబ్రతారాయ్ పంపించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ డాక్యుమెంట్ల భద్రపర్చడానికి సెబీ ఒక ప్రత్యేక వేర్హౌస్ను లీజ్‌కు తీసుకుంది. తర్వాత వాటిని డిజిటలైజ్ చేయించింది. రిఫండ్ చేయడానికి ఇన్వెస్టర్ల నుంచి క్లెయింలు కోరుతూ దేశవ్యాప్తంగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. కానీ తగినన్ని క్లెయింలు అందకపోవడంతో 11 ఏండ్లలో కేవలం రూ.138.7 కోట్ల రిఫండ్స్‌ను మాత్రమే సెబీ ఇవ్వగలిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.7 లక్షలు మాత్రమే ఇన్వెస్టర్లకు చెల్లించింది. ప్రత్యేకంగా ఓపెన్ చేసిన బ్యాంక్ ఖాతాల్లో ఉంచిన రెండు సహారా గ్రూప్ కంపెనీల సొమ్ము రూ.25,000 కోట్లను మించిపోయింది.