హైదరాబాద్, ఫిబ్రవరి 24: ప్రభుత్వరంగ సంస్థ యూకో బ్యాంక్ భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రూ.4 లక్షల కోట్ల వ్యాపారం లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో సోమ శంకర ప్రసాద్ తెలిపారు. హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అంతక్రిత ఏడాది రూ.3.4 లక్షల కోట్లు స్థాయిలో ఉండగా, డిసెంబర్ 31, 2022 నాటికి ఇది రూ.3.94 లక్షల కోట్లకు చేరుకున్నదన్నారు. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం, మరోవైపు, గతేడాదికాలంలో భారీ స్థాయిలో రుణాలు వసూలు చేయగలిగామన్నారు. అలాగే 2022-23లో బ్యాంక్ నికర లాభం రూ.1,700 కోట్లు దాటవచ్చునని చెప్పారు. టైర్-1 బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.500 కోట్ల వరకు నిధులను సమీకరించాలనుకుంటున్నట్లు తెలిపారు.