Twitter | సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్.. తన యూజర్లకు కొత్త ఫీచర్ తీసుకొస్తున్నది. ఆర్టికల్స్ పేరిట తెస్తున్న ఈ ఫీచర్ సాయంతో నెటిజన్లు పెద్ద పెద్ద వ్యాసాలు ట్వీట్ చేయొచ్చు. ఈ సంగతి స్వయంగా ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ చెప్పాడు. ఆర్టికల్స్‌కు ట్వీట్లలో అనుమతిపై ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు ఎలన్ మస్క్ సమాధానమిస్తూ ఈ సంగతి బయట పెట్టాడు. అంటే కంటెంట్ క్రియేటర్లు ఒక పుస్తకం కూడా ట్వీట్ చేయొచ్చునన్నమాట.
ఇప్పుడు ట్వీట్టర్లో రాసే అక్షరాలపై పరిమితి ఉంది. సాధారణ యూజర్లు 280 అక్షరాల నిడివి గల ట్వీట్ చేయొచ్చు. కానీ త్వరలో వచ్చే ఫీచర్‌తో అక్షరాల పరిమితి లేకుండా ట్వీట్లు చేయొచ్చు. కంటెంట్ క్రియేటర్లకు ఆర్టికల్స్ ఫీచర్ ఎంతో ఉపయోగంగా ఉంటుందని ట్విట్టర్ భావిస్తున్నది. ఈ ఫీచర్ యూజర్లందరికీ అందుబాటులోకి తెస్తారా.. బ్లూ సబ్ స్క్రైబర్లకే పరిమితం చేస్తారా? అన్న సంగతి తెలియలేదు.
ప్రారంభంలో ట్విట్టర్లో కేవలం 140 అక్షరాల నిడివి గల ట్వీట్లకే పరిమితి ఉండేది. 2018లో 280 అక్షరాలకు పెంచినా.. ఇంకా లిమిట్ పెంచాలని యూజర్లు కోరారు. గతేడాది ట్విట్టర్ టేకోవర్ చేసిన తర్వాత..ట్విట్టర్ 2.0 అనే పేరుతో పలు మార్పులు తెచ్చాడు.
బ్లూ సబ్ స్క్రిప్షన్ పేరిట కొన్ని ఫీచర్ల వాడకంపై లిమిట్స్ తెచ్చారు. కానీ, ఒక రోజులో యూజర్లు చూసే ట్వీట్లపై లిమిట్ విధించడంపై నెటిజన్లు అసంత్రుప్తి వ్యక్తం చేశారు. దీంతో యూజర్లు ట్విట్టర్’కు గుడ్ బై చెప్పేసి.. మెటా తెచ్చిన ‘థ్రెడ్స్’ యాప్ వైపు మళ్లుతున్నారు.