Twitter on Elon Musk Deal | తమ సంస్థను ఎలన్‌మస్క్ టేకోవర్ చేసుకోవడంపై మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ రియాక్టయింది. హార్ట్ స్కాట్ రొడినో యాంటీ ట్రస్ట్ ఇంప్రూవ్మెంట్ చట్టం-1976 ప్రకారం ట్విట్టర్‌ను టేకోవర్ చేయడానికి ఎలన్‌మస్క్‌కు వెయిటింగ్ పీరియడ్ ముగిసిందని ట్విట్టర్ శుక్రవారం తెలిపింది. వాటాదారుల ఆమోదం, క్లోజింగ్ కండీషన్లు, నియంత్రణ సంస్థల ఆమోదాన్ని బట్టి మాత్రమే ట్విట్టర్‌ను ఎలన్‌మస్క్ టేకోవర్ చేయగలుగుతారని కుండ బద్ధలు కొట్టింది.
44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానని తొలుత ఎలన్‌మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీన్ని ట్విట్టర్ యాజమాన్యం తిరస్కరించింది. కానీ ఇతర మార్గాల్లో ట్విట్టర్లో వాటాలను కొనుగోలు చేయడానికి ఎలన్‌మస్క్ ప్రయత్నించడంతో ఆయన ప్రతిపాదనకు ట్విట్టర్ బోర్డు అంగీకారం తెలిపింది.
తదనుగుణంగా నిధుల సేకరణకు దిగిన ఎలన్‌మస్క్ తర్వాత మాట మార్చారు. ట్విట్టర్లో స్పామ్ ఖాతాలు 25 శాతానికంటే ఎక్కువేనని ఆరోపణలకు దిగారు. దీనిపై ట్విట్టర్ యాజమాన్యం స్పష్టత ఇచ్చే వరకు ముందుకెళ్లలేమని ఎలన్‌మస్క్ ఇటీవల తేల్చేశారు. ఈ నేపథ్యంలో తమ సంస్థను ఎలన్‌మస్క్ టేకోవర్ చేసే విషయమై వెయిటింగ్ పీరియడ్ ముగిసిందని ట్విట్టర్ పేర్కొనడం గమనార్హం.