TVS E- Scooter | దుబాయి, ఆగస్టు 24: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్…ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లోకి అడుగుపెట్టింది. టీవీఎస్ ఎక్స్ పేరుతో విడుదల చేసిన ఈ స్కూటర్ ప్రారంభ ధరను రూ.2.50 లక్షలుగా నిర్ణయించింది. 4.44 కిలోవాట్ల సామర్థ్యంతో తయారు చేసిన ఈ స్కూటర్ కేవలం 2.6 సెకండ్లలో సున్నా నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నట్లు కంపెనీ సీఈవో కేఎన్ రాధాకృష్ణన్ తెలిపారు.
గంటకు 105 కిలోమీటర్లు ప్రయాణించే ఈ స్కూటర్ త్వరలో భారత్‌తోపాటు అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. రెండు రకాల్లో లభించనున్న ఈ స్కూటర్ కొనుగోలుదారుడు 50 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ లేదా నాలుగున్నర గంటల్లో 80 శాతం చార్జింగ్ రకాలను ఎంచుకునే అవకాశం కల్పించింది. ఇప్పటికే ఈ స్కూటర్ కోసం ముందస్తు బుకింగ్‌లు ఆరంభించినట్లు, కంపెనీ వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు నవంబర్ తొలి వారం నుంచి అందచేయనున్నట్లు పేర్కొంది. ఈ నూతన మాడల్‌ను ఉత్పత్తి చేయడానికి రూ.250 కోట్ల మేర పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. ఈ స్కూటర్లో 10.2 అంగుళాల హెచ్డీ+టీఎఫ్టీ టచ్‌స్క్రీన్, నావిగేషన్, సంగీతం, వీడియో ఆఫరింగ్, గేమ్స్ కూడా ఆడుకోవచ్చును.