TVS Jupiter | న్యూఢిల్లీ, ఆగస్టు 22: దేశీయ ప్రధాన ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో ఒకటైన టీవీఎస్ మోటర్.. గురువారం తమ పాపులర్ మాడల్ జూపిటర్‌లో సరికొత్త వెర్షన్‌ను పరిచయం చేసింది. 110సీసీ సామర్థ్యంతో వచ్చిన ఈ స్కూటర్ ప్రారంభ ధర ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం రూ.73,700లుగా ఉన్నది. కాగా, మున్ముందు మార్కెట్లో స్కూటర్లకు మరింత డిమాండ్ ఉంటుందని, దేశీయ ద్విచక్ర వాహన అమ్మకాల్లో స్కూటర్ల వాటా త్వరలోనే ఇంచుమించుగా 40 శాతానికి చేరగలదని సంస్థ సీఈవో కేఎన్ రాధాకృష్ణన్ ఈ సందర్భంగా అంచనా వేశారు.
ప్రస్తుతం టూవీలర్ అమ్మకాల్లో 32 శాతం స్కూటర్లవేనని తెలియజేశారు. నగరాలేగాక గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్కూటర్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని వివరించారు. ఇక పరిశ్రమ వార్షిక చక్ర వృద్ధిరేటు 8 శాతంగా ఉంటే.. తమ సంస్థది 12 శాతంగా ఉందని చెప్పారు. రాబోయే పండుగ సీజన్లో అమ్మకాలు బాగుంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కొనుగోలుదారుల అభిరుచులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్త మాడళ్లను ఆవిష్కరిస్తామన్నారు.