హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): ముగిసిన ఆర్థిక సంవత్సరం(2022-23)లో సింగరేణి సంస్థ రూ.32,830 కోట్ల టర్నోవర్ సాధించిందని సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో సాధించిన రూ.26,619 కోట్ల కంటే 23% అధికమని వివరించారు. 2026-27 నాటికి సింగరేణి టర్నోవర్ రూ.50 వేల కోట్ల మార్క్‌ను చేరుకుంటుందని, ఇందుకు అవసరమైన అన్ని అనుకూలతలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో 75 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధిస్తామని, ఆ తరువాత రెండేండ్లలో 80 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. లక్ష్య సాధన కోసం కార్మికులు, అధికారులు, ఉద్యోగులందరూ సమిష్టి కృషితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
స్వరాష్ట్రంలో 173% వృద్ధి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2013-14లో సింగరేణి టర్నోవర్ రూ.12,000 కోట్లతో పోల్చితే 2022-23లో సాధించిన టర్నోవర్ 173% అధికమని శ్రీధర్ వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశంలో సింగరేణి సంస్థ సాధించిన ప్రగతికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 50 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే ఉండగా ముఖ్యమంత్రి దిశానిర్దేశంలో 10 కొత్త గనులను ప్రారంభించామని తెలిపారు. దీనితోపాటు థర్మల్, సౌర విద్యుత్తు రంగాల్లోకి సింగరేణి ప్రవేశించడంతో అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, వ్యాపారాన్ని ఎనిమిది రాష్ర్టాలకు విస్తరించిందని చెప్పారు.
సింగరేణికి నాలుగు గనులు!
కేంద్రం వేలంపాటలో ఉంచిన సింగరేణికి సంబంధించిన నాల్గు గనులుకూడా తిరిగి సింగరేణికే కేటాయించే అవకాశం ఉన్నదని శ్రీధర్ పేర్కొన్నారు. 2023-24 లో 750 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలంటే.. ఈ ఏడాదిలో ప్రారంభం కానున్న నాల్గు కొత్త గనుల నుంచి 104 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి కీలకమన్నారు.