హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ సరికొత్త రికార్డును నెలకొల్పింది. విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న శ్రామిక్-హెల్పర్లు, డ్రైవర్లు, కండక్టర్ల, సూపర్వైజర్లు, ఇతర అధికారులను ప్రోత్సహించడానికి సంస్థ యాజమాన్యం అవార్డులు, రివార్డులను ప్రదానం చేసింది. రోల్ ఆఫ్ హానర్, ఎక్స్‌ట్రామైల్, ఇన్నోవేషన్, బెస్ట్ఎంప్లాయ్, ఉత్తమ డిపో, ఉత్తమ రీజియన్ వంటి వివిధ క్యాటగిరీల కింద దాదాపు 500 మందికి అవార్డులను అందజేసింది. మంగళవారం బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళామండపంలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ సంస్థ ఉన్నతాధికారులతో కలిసి పురసార గ్రహీతలకు మెమెంటో, శాలువా, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఉత్తమ పనితీరు కనబరిచిన 24 మంది ఉద్యోగులు, అధికారులకు రోల్ ఆఫ్ హానర్ కింద అవార్డులు బహూకరించారు.
వీరితోపాటు నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేసిన వారికి గౌరవప్రదమైన గుర్తింపుతో ప్రత్యేకంగా సతరించి అభినందించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. డిపో స్థాయిలో నెలవారీగా, ప్రాంతీయ స్థాయిలో త్రైమాసికం, జోనల్ స్థాయిలో ఆరు నెలల కొకసారి, కార్పొరేట్ స్థాయిలో ఏడాదికొకసారి అవార్డులు అందజేస్తామని తెలిపారు. వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. సమష్టి కృషితోనే సంస్థకు మంచి పేరు వస్తున్నదని, గడ్డు పరిస్థితులను తట్టుకుని నిలబడగలిగే స్థాయికి ఎదగడం సంస్థలో ప్రతి ఒకరి కృషి ఫలితమేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్, జాయింట్ డైరెక్టర్ (వీఅండ్ఎస్) సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, వినోద్ పాల్గొన్నారు.
డ్రైవర్లు: జీ సైదులు, ఎం హనుమయ్య, జీ శ్రీశైలం, సీహెచ్ లక్ష్మయ్య
కండక్టర్లు: సీహెచ్ నర్సయ్య, పీ సత్తయ్య, కే నర్సింహ, కే కవిత
మెకానిక్‌లు: జీ రాజేందర్, ఎండీ బద్రుద్దీన్,
టైర్ మెకానిక్: ఎంఏ రవూఫ్
శ్రామిక్: శివలింగం అసిస్టెంట్ మేనేజర్లు (టీ): బీ అశ్విని, ఆర్ సరితాదేవి, ఎన్ వెంకన్న, ఎం హుస్సేన్
ఏఈ (ఎం): ఆర్ హనుమాన్, ఈ అమల
సూపరింటెండెంట్: జేబీ చార్యులు
డిపోమేనేజర్లు: ఎన్ ఇషాఖ్, బీ పాల్, బీ శ్రీనివాసరావు
డిప్యూటీ ఆర్ఎం(ఓ): జీ అపర్ణ కల్యాణి
రీజినల్ మేనేజర్: సీహెచ్ వెంకన్న